పరిషత్ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండాలనే నిర్ణయంపై సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ, కూన రవికుమార్ వంటివాళ్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జ్యోతుల నెహ్రూ పార్టీ నిర్ణయం పట్ల తన అసంతృప్తిని ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసి వ్యక్తం చేశారు. జగ్గంపేట ఇన్ఛార్జ్గా కొనసాగనున్నట్లు ప్రకటించారు. ఇతర నేతలు మాత్రం ఎన్నికలకు దూరంగా ఉండాలనే నిర్ణయాన్ని గట్టిగా సమర్ధించారు.
తెలుగుదేశం పార్టీ 40ఏళ్ల రాజకీయ చరిత్ర పరిశీలిస్తే ఎన్నికలకు దూరంగా ఉన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. 1991లో నంద్యాల లోక్‌సభ ఉప ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి పి.వి.నరసింహారావు పోటీ చేశారు. దేశానికి ప్రధానమంత్రి ఒక తెలుగువారు కావాలనే గౌరవ సూచకంతో పార్టీ అధ్యక్షులు ఎన్టీఆర్ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి ఎవరినీ పోటీలో నిలబెట్టకుండా చారిత్రక నిర్ణయం తీసుకున్నారు.
కాంగ్రెస్ వ్యతిరేక భావాలతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ ఈ నిర్ణయం తీసుకోవటం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశమైంది. 2001లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నల్లగొండ జిల్లా దేవరకొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే ధీరావత్ రాగ్యానాయక్ను నక్సల్స్ హత్య చేశారు. కాంగ్రెస్ అభ్యర్థన మేరకు తెలుగుదేశం పార్టీ అప్పటి ఉపఎన్నికల్లో పోటీ పెట్టలేదు. రాగ్యానాయక్ భార్య భారతి రాగ్యానాయక్ ఏకగ్రీవంగా గెలిచారు. 2008లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే పీజేఆర్ మరణం అప్పుడూ తెలుగుదేశం పార్టీ ఇదే సంప్రదాయాన్ని కొనసాగించింది. పీజేఆర్ మరణంతో వచ్చిన ఉపఎన్నికలో ఆయన కుమారుడు విష్ణువర్థన్ రెడ్డి గెలుపునకు సహకరించాలని కాంగ్రెస్ పార్టీ చేసిన విజ్ఞప్తి మేరకు తెలుగుదేశం పోటీనుంచి తప్పుకుంది.
2009లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం వచ్చిన ఉపఎన్నికలో ఆయన సతీమణి విజయమ్మను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటిస్తే ఏకగ్రీవానికి తెలుగుదేశం పార్టీ తన మద్దతు ప్రకటించింది. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ రోడ్డు ప్రమాదంలో వైకాపా నేత శోభానాగిరెడ్డి మరణంతో వచ్చిన ఉపఎన్నికకు ఆమె కుమార్తె భూమా అఖిలప్రియపై తెలుగుదేశం పోటీ పెట్టకుండా సహకరించింది. స్థానికంగా నెలకొన్న సెంటిమెంట్, అకారణంగా మరణించిన ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యులు ఉపఎన్నికలో పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థులకు గౌరవ సూచికంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా మద్దతు తెలిపింది తప్ప పోటీని బహిష్కరించటం ఇదే తొలిసారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా.. ఎప్పుడూ ఈ తరహాలో బహిష్కరించలేదని గుర్తు చేస్తున్నారు.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించడానికి రాష్ట్రంలో అసాధారణ పరిస్థితులు నెలకొనటమే కారణమని... తెదేపా వర్గాలు గట్టిగా చెప్తున్నాయి. నిర్ణీత గడువు ఉండాలన్న న్యాయస్థానం నిబంధనలన్నీ ఉల్లంఘించటంతో పాటు కోర్టులో కేసు పెండింగ్లో ఉండగా రాత్రికి రాత్రే నోటిఫికేషన్ జారీ చేయటం అప్రజాస్వామికమని నేతలు స్పష్టం చేస్తున్నారు. దొంగ-పోలీస్ ఒక్కటైన రీతిలో రాష్ట్ర వాతావరణం ఉందనీ, రెండేళ్ల వైకాపా ప్రభుత్వ అనైతిక పాలనలో భాగస్వామిగా ఉన్న వ్యక్తిని ఎన్నికల కమిషనర్గా నియమిస్తే స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు ఆస్కారం ఉండదన్నది తెలుగుదేశం నేతల వాదన.
రాజకీయ పార్టీ నేతలను చర్చలకు పిలిచి రాత్రికి రాత్రే నోటిఫికేషన్ జారీ చేయటం, 4విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఒకే దఫాలో పరిషత్ ఎన్నికలను పూర్తి చేయాలనుకోవటం వంటి ఉదాహరణలు అధికార దుర్వినియోగంతో ఏకపక్ష ఎన్నికల నిర్వహణకు అద్దం పడుతున్నాయని తెలుగుదేశం నేతలు చెప్తున్నారు. తాము తీసుకున్న నిర్ణయం పార్టీ క్యాడర్ పైనా, నేతలపైనా ఎలాంటి ప్రభావం ఉండదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజకీయాలను పరిశీలిస్తే గతంలో జయలలిత, జ్యోతిబసు, మాయావతి వంటి నేతలు ఇదే తరహాలో స్థానిక ఎన్నికలను బహిష్కరించి.. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారని ఉదాహరణలుగా చూపుతున్నారు.
ఇదీ చదవండీ... పరిషత్ ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై ఎస్ఈసీ ఆరా