Theft in New House: ఎవరింట్లోనైనా దొంగలు పడితే.. డబ్బెంత పోయింది.. బంగారం ఎంత పోయింది? అని ఆరా తీస్తాం. కాలనీలో వాళ్లతో వీళ్లతో అయ్యో పాపం అంటూ సానుభూతి చర్చలు పెడతాం. వాళ్లింట్లో జరిగిన దొంగతనానికి మనం అలర్ట్ అవుతాం. ఈ సారి ఊరెళ్లేటప్పుడు.. నగదు, నగలను బ్యాంకులో పెట్టుకుని వెళ్తాం. లేదంటే ఇంట్లో ఒకరిని ఉంచి వెళ్తాం. ఇంటికి తాళం వేసి వెళ్తే.. తెల్లారేసరికి దొంగలు చేసే ఘనకార్యం తెలుసు కాబట్టే.. ఇన్ని జాగ్రత్తలు పడతాం. కానీ ఆ ఇంటి యజమానికి ఈ తిప్పలు అవసరం లేదు. తలుపులు బార్లా తెరిచి పోయినా.. ఆ ఇంట్లో ఊడ్చుకుపోవడానికి ఏమీ లేదు. అటువంటి ఇంట్లోనూ దొంగతనం చేశారు. అదేంటో ఏ దొంగకూ రాని ఐడియా వీళ్లకు వచ్చింది. అదే వింత దొంగతనం. ఎవరూ ఊహించని రీతిలో చోరీకి పాల్పడ్డారు. తెల్లారక విషయం తెలుసుకున్న యజమాని ఇదేం ఖర్మరా బాబు.. వీళ్లేం దొంగలురా నాయనా అంటూ తల పట్టుకున్నారు. ఇంతకీ ఈ వింత దొంగలు ఏం చేశారంటే..?
ఇల్లు బీటలు వారిందని
తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని సాయిరాం కాలనీలో రఘు అనే స్థానికుడు.. గతేడాది నూతనంగా ఇల్లు కట్టారు. ఇల్లు నిర్మాణ పని మొత్తం పూర్తైంది. త్వరలో గృహప్రవేశం చేద్దామనుకున్నారు. కానీ కాంట్రాక్టర్ కక్కుర్తి, నిర్లక్ష్యంతో కట్టిన కొద్ది రోజుల్లోనే ఇల్లు బీటలు వారింది. బీటలు వారిన ఇల్లు కిందికి దిగిపోవడంతో.. మరమ్మతులు పూర్తి చేశాకే కొత్తింట్లోకి వెళదామకున్నారు. ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. అందుకు కావల్సిన సామగ్రి సమకూర్చుకున్నారు.
లోపలికి వచ్చారు.. షాకయ్యారు
ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేనిది గమనించిన దుండగులు.. శనివారం అర్ధరాత్రి సమయంలో అక్కడికి చేరుకున్నారు. ఆ ఇంటికి నలువైపులా మరే ఇల్లు లేకపోవడం కూడా వారి ప్రణాళికకు కలిసొచ్చింది. పూర్తిగా కాలనీ చివర్లో ఇల్లు ఉండటంతో దొంగతనానికి అనువుగా ఉంటుందనుకున్నారు. ఇంట్లోకి ప్రవేశించారు. కానీ కొత్తింట్లో ఏం దొంగతనం చేశారు అనే కదా మీ సందేహం.. అక్కడికే వస్తున్నా.. ఇంటి వెనకాల నుంచి వచ్చిన దొంగలు తాళం విరగ్గొట్టి లోపలికి చొరబడ్డారు. అంతే ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఎందుకంటే ఆ ఇంట్లో ఎత్తుకుపోదామన్నా కనీసం మంచి నీళ్ల గ్లాసు కూడా లేదు. ఇల్లు చూస్తే జబర్దస్త్గా ఉంది.. తీరా లోపల చూస్తే ఏం లేదని నిట్టూర్చారు. అయినా నిరాశపడలేదు. మనసుంటే మార్గముంటుంది అన్నట్లుగా.. వారి బుర్రలో అప్పుడే ఓ లైటు వెలిగింది. అంతే ఆ ఆలోచనను వెంటనే అమల్లో పెట్టేశారు.