ATM Technical Issues: ఏటీఎంలలో నిల్వ ఉంచే డబ్బు కాజేసేందుకు నేరస్థులు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు పదుల సంఖ్యలో ఏటీఎం కార్డులను తీసుకుని వస్తున్నారు. బ్యాంక్ మేనేజర్ల ఫిర్యాదులతో నిందితుల్లో కొందరిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నా.. మళ్లీమళ్లీ వస్తున్నారు. తాజాగా నల్లకుంట స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ తమ ఏటీఎంలోంచి గుర్తు తెలియని వ్యక్తులు 19సార్లు నగదు విత్‌డ్రా చేసుకున్నారని, నగదు లావాదేవీ రద్దయ్యిందంటూ వారు రాజస్థాన్, హరియాణాలో మళ్లీ డబ్బు తీసుకున్నారంటూ సైబర్ క్రైమ్స్ పోలీస్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజీలను తెలంగాణ పోలీసులకు సమర్పించారు.
ఇలా చేస్తున్నారు...హరియాణా.. రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన యువకులు భాగ్యనగరంలోని ఏటీఎం కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఒకటి, రెండేళ్ల నుంచి నేరాలకు పాల్పడుతున్నారు. వారి సొంతూళ్లో బంధువులు, పరిచయస్థుల ఏటీఎం కార్డులను తీసుకుని హైదరాబాద్‌కు వస్తున్నారు. నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లకు సమీపంలో లాడ్జిల్లో దిగుతున్నారు. రైల్వేస్టేషన్లకు రెండు, మూడు కిలోమీటర్ల పరిధిలో భద్రతా సిబ్బంది, సీసీ కెమెరాలు లేని ఏటీఎం కేంద్రాలను ఎంపిక చేసుకుంటున్నారు.
- తొలుత క్యాష్ డిపాజిట్ మిషన్ ఉన్న ఏటీఎంను ఎంచుకుని రూ.20వేల నుంచి రూ.40వేల వరకు నగదు జమ చేస్తున్నారు. అనంతరం జన సంచారంలేని ఏటీఏం కేంద్రాలకు ఇద్దరు చొప్పున వెళ్తున్నారు. ఒకరు నగదు విత్‌డ్రా చేసుకునేందుకు కార్డు యంత్రంలో ఉంచగానే.. సరిగ్గా నగదు వస్తున్నప్పుడు రెండో నిందితుడు ఏటీఎంకు విద్యుత్ సరఫరా చేస్తున్న మీటను ఆపేస్తాడు. అనంతరం స్విచ్‌ఆన్ చేస్తాడు.
- నగదు పూర్తిగా వస్తుండగానే ఒకడు డబ్బులాగేసుకుంటాడు. ఏటీఎంకు విద్యుత్ సరఫరా రాగానే నగదు లావాదేవీ రద్దు అయ్యిందన్న రసీదును తీసుకుంటున్నారు. ఇలా నాలుగైదు ఏటీఎం కేంద్రాల్లో రూ.లక్షలు నగదు విత్‌డ్రా చేసుకున్నాక సొంతూళ్లకు వెళ్తున్నారు.
- అక్కడికి వెళ్లాక తమ నగదు లావాదేవీలు రద్దయినా.. పొదుపు ఖాతాలో నగదు తగ్గిందంటూ వినియోగదారుల సేవా కేంద్రాలకు ఫోన్లు చేస్తున్నారు. వారి సూచనలతో బ్యాంకులకు వెళ్లి నగదు లావాదేవీ రద్దయిన రసీదును చూపిస్తున్నారు. ఈ రసీదు ఆధారంగా బ్యాంకులు నగదు జమ చేస్తున్నాయి.