రాష్ట్రానికి పరిశ్రమలను ఆకర్షించాల్సింది పోయి... ఉన్న వాటిని పోగొట్టే విధంగా ప్రభుత్వ వ్యవహార శైలి ఉందని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది. పారిశ్రామిక రంగంపై మంత్రి గౌతం రెడ్డి విడుదల చేసిన శ్వేతపత్రంపై ఆపార్టీ నేతలు ఎదురుదాడి చేశారు. శ్వేతపత్రాల్లో అభూతకల్పనలు చేస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. కియా పరిశ్రమను ఎంపీ మాధవ్ బెదరకొట్టారని ఆరోపించారు.
పారిశ్రామిక వేత్త మొహన్ దాస్ పాయ్ చెప్పినట్లుగా... ప్రభుత్వ తీవ్రవాదం రాష్ట్రంలో నడుస్తోందన్నారు. పారిశ్రామిక సదస్సులు ఎన్నో నిర్వహించి లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చిన ఘనత తెదేపా ప్రభుత్వానిదని చెప్పారు. గత ఐదేళ్లలో ఏ రాష్ట్రంలో లేని పారిశ్రామిక ప్రగతిని చంద్రబాబు ప్రభుత్వం చేసి చూపించిందని స్పష్టం చేశారు. సులభతర వాణిజ్యం లోనూ అగ్రగామిగా నిలిచామని ఆయన అన్నారు.