TSPSC Group 1 Preparation Tips: వేల మంది నిరుద్యోగ యువత ఏళ్లుగా ఎదురు చూస్తున్న తెలంగాణ గ్రూపు-1 నోటిఫికేషన్ త్వరలో వెలువడనుంది. 503 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అందులో ప్రాథమిక పరీక్షకు లక్షల మంది దరఖాస్తు చేస్తారు. వారందరికీ యూపీఎస్‌సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా సన్నద్ధమయ్యే అభ్యర్థుల నుంచి తీవ్ర పోటీ ఎదురుకానుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రం నుంచి సివిల్స్ ప్రిలిమినరీ పోటీకి ఏటా 50-55 వేల మంది దరఖాస్తు చేస్తున్నారు. అందులో సగం మందే పరీక్షకు హాజరవుతున్నారు. గత ఏడాది అక్టోబరు 10న జరిగిన సివిల్స్-2021 ప్రాథమిక పరీక్షను 22,193 మందే రాశారు. వారిలో 450-600 మంది ప్రధాన పరీక్షకు అర్హత పొంది...చివరకు 20-30 మంది ఏదో ఒక సర్వీస్ సాధిస్తున్నారు. ఆ పోటీలో విజయాన్ని చేజార్చుకున్న అభ్యర్థులు గ్రూపు-1 రేసులో వారికి గట్టి పోటీదారులుగా నిలిచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
వారి నుంచే ఎందుకు?:యూపీఎస్‌సీ ప్రతి ఏటా క్రమం తప్పకుండా సివిల్స్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు ఎప్పుడో ముందుగానే ప్రకటిస్తుంది. అందువల్ల సివిల్స్‌కు పోటీపడేవారు ఎక్కువ మంది కనీసం మూడేళ్లు అహర్నిశలు పరీక్షలో విజయం సాధించేందుకు కృషి చేస్తారు. అందుకే ఐచ్ఛిక సబ్జెక్టుతో పాటు జనరల్ స్టడీస్‌పైనా పట్టు సాధిస్తుంటారు. ‘సివిల్స్, గ్రూపు-1 సిలబస్ కనీసం 80 శాతం ఒకటే అయినందున గ్రూపు-1 రాసే ఇతర అభ్యర్థులకు వీరు తీవ్ర పోటీ ఇస్తారు’ అని రాష్ట్ర గ్రూపు-1 అధికారుల సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి నూతనకంటి వెంకట్ అభిప్రాయపడ్డారు.
అలాగని గ్రూప్ పరీక్షలకు సిద్ధమయ్యే వారు భయపడాల్సిన అవసరం లేదని.. శాస్త్రీయంగా, పక్కా ప్రణాళికతో సన్నద్ధం కావాల్సి ఉంటుందని, సిలబస్‌లోని ప్రతి పదం గురించి కనీసం ఒక పేజీ సమాచారం పాయింట్స్ రూపంలో తయారు చేసుకుంటూ నిరంతరం ప్రిపరేషన్ కొనసాగిస్తే సివిల్స్ అభ్యర్థులకు దీటుగా విజయం సాధించవచ్చన్నారు.