జీవో 2430 జారీ చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం 'పరువుకు నష్టం కలిగిచే వార్తల ' వ్యవహారం చూసేందుకు మాత్రమే అని సాధారణ పరిపాలనశాఖ ఎక్స్ అఫిషియో ప్రత్యేక కార్యదర్శి విజయ్ కుమార్ రెడ్డి హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేశారు. అంతేకానీ పిటిషనర్లు చెబుతున్నట్లు ఆయా శాఖల కార్యదర్శులు... మీడియాపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు కాదన్నారు. జీవో 2430ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైన సంగతి తెలిసిందే. రద్దయిన ఉత్తర్వులు 938ని ప్రస్తావిస్తూ... జీవో 2430ని ఎలా ఇచ్చారని హైకోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ నేపథ్యంలో విజయ్ కుమార్ రెడ్డి ప్రమాణపత్రం దాఖలు చేస్తూ... 2007 మార్చి 20 నాటి జీవో 938ని తాజాగా జారీచేసిన జీవో 2430లో ఉటంకించడం అనవసరమేనని అంగీకరించారు. జీవో 938ని రద్దు చేసినంతమాత్రాన పరువునష్టం కలిగించే వార్తలు ప్రచురించడానికి న్యాయబద్ధత కల్పించినట్లు కాదన్నారు. జీవో 2480తో నిరాధార వార్తలు వచ్చినప్పుడు ప్రత్యుత్తరం(రీజాయిండర్) ఇచ్చేందుకు...అవసరం అయితే ఫిర్యాదులు దాఖలు చేసేందుకు ఆయాశాఖల కార్యదర్శులకు అధికారాలు అప్పగించారన్నారు. కేవలం క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కాదన్నారు. చట్టపరమైన చర్య అనేది చివరి దశ అని.... అదీ అవసరం అయితేనే అన్నారు. గ్రామీణ ప్రాంత రిపోర్టర్లను, చిన్న పత్రికలను బెదిరింపులకు పాల్పడేదిగా జీవో ఉందని పిటిషనర్ చెబుతున్న దాంట్లో వాస్తవం లేదన్నారు.
'పరువు నష్టం కలిగించే వార్తల పరిశీలనకే జీవో' - ఏపీలో వివాదాస్పద జీవో
మీడియా స్వేచ్ఛపై ఆంక్షలు విధించేలా జీవో 2430 లేదని సాధారణ పరిపాలనశాఖ ఎక్స్ అఫిషియో ప్రత్యేక కార్యదర్శి హైకోర్టుకు వెల్లడించారు. ఆయా శాఖల కార్యదర్శులు... మీడియాపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు దీనిని జారీ చేయలేదని చెప్పారు.
హైకోర్టు