Jagananna Layouts: గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన టిడ్కో ఇళ్లకు కొత్త ప్రభుత్వం చరమగీతం పాడిన విషయం తెలిసిందే. 25 శాతం పైన నిర్మాణం అయిన వాటిని మాత్రమే పూర్తి చేసి అప్పగించాలని నిర్ణయించింది. పట్టణ పేదలకు సెంటు స్థలం, గ్రామీణ పేదలకు సెంటున్నర చొప్పున జగనన్న కాలనీలలో నివేశన స్థలాలు పంపిణీ చేశారు.
పలుచోట్ల భారీ లేఔట్...
నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇళ్లు పథకం కింద వైకాపా ప్రభుత్వం దీన్ని చేపట్టింది. ఇందులో భాగంగా విజయవాడలోని నిరుపేదలకు పలుచోట్ల భారీ లేఔట్ వేశారు. దాదాపు 90వేల మంది అర్హులను గుర్తించారు. వీరిలో 27వేల వరకు టిడ్కో ఇళ్లు మినహా మిగిలిన వారికి స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కొండపావులూరు, నున్న, కొత్తూరు తాడేపల్లి, ముత్యాలంపాడు, ఇబ్రహీంపట్నం, కండపల్లి తదితర ప్రాంతాల్లో భారీ లేఔట్‌లు వేశారు. దాదాపు 30వేల మందికి నివేశన స్థలాలు పంపిణీ చేశారు. మిగిలిన వారికి రాజధాని గ్రామాల్లో ఇవ్వాలని ప్రణాళికలు రూపొందించారు. మందడం గ్రామంలో విజయవాడ నిరుపేదలకు దాదాపు 10వేల మందికి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.