తెలంగాణలోని భాగ్యనగర శివార్లలో దొంగల ముఠాలు హల్‌చల్ చేస్తున్నాయి. బీరువాల్లో నగలు.. ఎవరికీ తెలియకుండా దాచామని భావించే నగదు.. భద్రతా సిబ్బంది.. సీసీ కెమెరాలు.. అయినా దొంగలు గురిపెడితే ఇవేమీ అడ్డుకావని పలు ఘటనలు నిరూపిస్తున్నాయి. రూ.1-2 కోట్లతో నిర్మించుకున్న భవన తలుపులకు సరైన తాళాలు లేకపోవడంతో దొంగలు సులువుగా లోపలకు చేరుతున్నట్లు తెలంగాణ పోలీసు అధికారులు చెబుతున్నారు. కొన్ని ఇళ్లల్లో చోరీలకు యజమానుల నిర్లక్ష్యం కూడా కారణమవుతోందని చెబుతున్నారు. అపార్ట్‌మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీల్లోని ఇళ్లకు నాసిరకం తాళాలు ఉపయోగిస్తున్నారు.
రెక్కీ చేసినా గుర్తించలేక..యూపీ, ఎంపీ, కర్ణాటక, బిహార్, గుజరాత్‌కు చెందిన అంతర్రాష్ట్ర దొంగలు శివార్లలోని ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటాయి. 1-2 రోజులు ముందుగానే రెక్కీ నిర్వహిస్తారు. కొత్త వ్యక్తులు నివాసాల చుట్టూ తిరుగుతున్నా పసిగట్టకపోవటం దొంగలకు కలిసొస్తుంది. పాతబస్తీకి చెందిన కరడుగట్టిన దొంగ గఫార్‌ఖాన్.. విల్లాలు, డూప్లెక్స్ ఇళ్లే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు దిగేవాడు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 4 గంటల వ్యవధిలో వంట గది కిటీకీ ఊచలను తొలగించి లోపలికి చేరతాడు. చంద్రి అనే మరో దొంగ అర నిమిషంలో రాడ్‌తో తాళం తప్పించి దర్జాగా పని పూర్తి చేస్తాడు.