విశ్వవిద్యాలయాలు, కళాశాలలు నూతన విద్యా సంవత్సరాన్ని అక్టోబరు ఒకటి నుంచి ప్రారంభించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) పేర్కొంది. అడ్మిషన్ల ప్రక్రియను సెప్టెంబరు 30లోపు పూర్తి చేయాలని ఆదేశించింది. విద్యాసంవత్సరం అక్టోబరు 1న ప్రారంభమై జులై 31వ తేదీ వరకు పూర్తయ్యేలా చూసుకోవాలంది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఇతర రాష్ట్ర బోర్డులు 12వ తరగతి ఫలితాలు వెల్లడించిన తర్వాతే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపింది. ‘‘జులై 31లోపు పాఠశాలల బోర్డులు 12వ తరగతి ఫలితాలను వెల్లడిస్తాయి. ఒక వేళ ఆలస్యమైతే అక్టోబరు 18 నుంచి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించుకోవచ్చు’’ అని యూజీసీ పేర్కొంది.
బోధన- అభ్యసన ప్రక్రియను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, మిశ్రమ విధానంలో కూడా కొనసాగించవచ్చని చెప్పింది. కరోనా సమయంలో తల్లిదండ్రులు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న యూజీసీ... విద్యార్థులు అడ్మిషన్ అక్టోబరు 31వ తేదీలోపు రద్దు అయినా, లేక వేరే విద్యాసంస్థకు మైగ్రేషన్ అయినా మొత్తం ఫీజును తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. ఆ తరవాత డిసెంబరు 31లోపు ప్రవేశాలను రద్దు చేసుకుంటే కేవలం ప్రాసెసింగ్ రుసుం రూ.వెయ్యిని మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని స్పష్టం చేసింది. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు.. ఎట్టి పరిస్థితుల్లోనూ చివరి సంవత్సరం ఆఖరి టర్మ్ పరీక్షలను ఆగస్టు 31 లోపు పూర్తి చేయాలని స్పష్టం చేసింది.