లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన వలస కార్మికులు, తీర్థ యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థులు తమ స్వస్థలాలకు వెళ్లడానికి కేంద్ర హోం శాఖ అనుమతి ఇచ్చింది. రవాణా వ్యవస్థ స్తంభించి 35 రోజులుగా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో నానా ఇబ్బందులు పడుతున్న వీరందర్నీ తగు జాగ్రత్తలతో స్వస్థలాలకు తరలించడానికి కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అనుమతించింది. భారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల భుజస్కంధాలపై మోపింది. ఈ మేరకు లాక్‌డౌన్ నిబంధనలను సవరిస్తూ కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం వలస కార్మికులు తదితరుల తరలింపునకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఒక ప్రత్యేక నోడల్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. వారిని పంపడానికి, ఆహ్వానించడానికి ప్రామాణిక విధివిధానాలు రూపొందించాలి. తమ తమ రాష్ట్రాల్లో నిలిచిపోయిన వారి వివరాలను ఈ నోడల్ సంస్థ నమోదు చేయాలి.
* నిలిచిపోయిన వ్యక్తులు బృందాలుగా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలనుకుంటే వారిని పంపే, స్వీకరించే రాష్ట్రాలు మాట్లాడుకోవాలి. రోడ్డు మార్గం ద్వారా వారిని తరలించడానికి పరస్పరం అంగీకరించాలి.
* తరలించేవారిని ముందుగా స్క్రీనింగ్ చేయాలి. కరోనా లక్షణాలు కనిపించని వారినే అనుమతించాలి.
* రవాణాకు బస్సులు ఉపయోగించాలి. వాటిని ముందుగా శానిటైజ్ చేయాలి. సీట్లలో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి.
* ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వలస కూలీలు వెళ్లిపోవడానికి మార్గ మధ్యలో ఉన్న రాష్ట్రాలు అవకాశం కల్పించాలి.
* గమ్యస్థానాలు చేరుకున్న తర్వాత వారి ఆరోగ్య పరిస్థితులను స్థానిక వైద్యాధికారులు పరీక్షించాలి. అందర్నీ గృహ నిర్బంధంలో ఉంచాలి.
* అవసరమైనవారినే వ్యవస్థాగత క్వారంటైన్‌కి తరలించాలి. ఇలా వచ్చిన వారందరిపై నిఘా ఉంచాలి. తరచూ వారి ఆరోగ్యాన్ని పరిశీలించాలి.