కోట్లాది రూపాయల విలువైన ఖనిజ తవ్వకాలు జరిగిన కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం, జి.కొండూరు భూములు కొండపల్లి అభయారణ్యానికి (రిజర్వు ఫారెస్టు) చెందినవిగా ముగ్గురు అధికారుల కమిటీ తేల్చింది. అక్కడ ఇచ్చిన క్వారీ లీజులను రద్దు చేసి, భూములను అటవీశాఖకు అప్పగించాలని సూచిస్తూ నివేదికను కలెక్టర్ ఇంతియాజ్‌కు అందించారు. తక్షణమే క్వారీల లీజులను రద్దు చేయాలని గనుల శాఖను కలెక్టర్ ఆదేశించినట్లు తెలిసింది.
కొండపల్లి అభయారణ్యంలో కొత్త సర్వే నంబర్లను సృష్టించి ఇష్టానుసారంగా కంకర(రోడ్డు మెటల్) మట్టి కోసం అక్రమ తవ్వకాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల పది పొక్లెయిన్లను, కొన్ని టిప్పర్లను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. వాటి నిర్వాహకులతో ముందస్తుగా రూ.10 లక్షల డిపాజిట్ చేయించారు. స్వాధీనం చేసుకున్న వాహనాలు ఎవరివనే కోణంలో విచారిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
అయితే ఈ అక్రమ తవ్వకాలపై గనుల శాఖ నుంచి ఎలాంటి కేసు నమోదవలేదు. పైగా ఈ భూములపై రెవెన్యూ, అటవీశాఖల మధ్య వివాదం నెలకొంది. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో విజయవాడ సబ్‌కలెక్టర్ ధ్యానచంద్ర, జిల్లా అటవీ శాఖ అధికారి మంగమ్మ, గనుల శాఖ ఏడీ నాగిని సభ్యులుగా విచారణ కమిటీని వేశారు.
- కొన్నేళ్లుగా తవ్వకాల పరంపర
త్రిసభ్య కమిటీ అందుబాటులో ఉన్న రికార్డులను, గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పరిశీలించడంతోపాటు గ్రామాల్లో విచారణ అనంతరం ఆ భూములు అటవీ శాఖకు చెందినవిగా తేల్చారు. ఈప్రాంతాన్ని అటవీశాఖ అభయారణ్యంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అభయారణ్యంలో ఎలాంటి తవ్వకాలు చేయకూడదు. కనీసం రోడ్డు నిర్మించాలన్నా... కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి తీసుకోవాల్సిందే. అలాంటిది రోడ్డు మెటల్ కోసం కొన్నేళ్లుగా నిరభ్యంతరంగా తవ్వుకున్నారు.
* కడెం పోతవరం గ్రామ పటం ప్రకారం సర్వే నంబర్లు 1, 4, 6, 7, 48, 49, 50, 53, 54 కొండపల్లి రిజర్వు ఫారెస్టుకు సరిహద్దుగా ఉన్నాయి. దీని ప్రకారం అన్‌సర్వే బ్లాక్‌లు లేవని అటవీశాఖ వాదన. లోయ, కడెం పోతవరం, కొండపల్లి గ్రామ పటాలు ఇవే సూచిస్తున్నాయి. మీభూమి పోర్టల్ ప్రకారం సర్వే నంబరు 26/2 పరిధిలో 256.15 ఎకరాలు ఉంది. పట్టాదారు, అనుభవదారు కాలమ్‌లో అడవిగా పేర్కొన్నారు. అంటే ఇక్కడ క్వారీకి గనుల శాఖ అనుమతి ఇవ్వకూడదు. అన్‌సర్వే బ్లాక్ అనేది రెవెన్యూ సృష్టి. అక్కడ అన్‌సర్వే బ్లాక్ లేదు. కానీ ఇందులో 250 ఎకరాల భూముందని జి.కొండూరు తహసీల్దార్ ఎన్‌ఓసీ జారీ చేయగా, గనుల శాఖ 18 లీజులు ఇచ్చారు.