'తెలుగు అకాడమీ ఐదు దశాబ్దాలకు పూర్వం ఏర్పడింది. తెలుగు భాష సాంస్కృతిక పునరుజ్జీవానికి అది కృషి చేస్తోంది. ఇప్పుడు ఆ కృషిని, భాషను నాశనం చేసేందుకే తెలుగు అకాడమీని.. తెలుగు-సంస్కృత అకాడమీగా మార్చారు' అని తెలుగు భాషోద్యమ సమాఖ్య జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సామల రమేష్‌బాబు, ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి డాక్టర్ వెన్నిశెట్టి సింగారావు బుధవారం ఓ సంయుక్త ప్రకటనలో విమర్శించారు.
ఇది రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగు అకాడమీని రద్దు చేస్తూ తెలుగు- సంస్కృత అకాడమీగా మార్పు చేయడం ద్వారా తెలుగు భాష ఔన్నత్యాన్ని దెబ్బ తీస్తూ.. దాన్ని దశల వారీగా నిర్వీర్యం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ దురాగతాన్ని తెలుగు భాషాభిమానులు, మేధావులు, రచయితలు, ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. అందరూ కలసికట్టుగా ఉద్యమించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.