Students agitation against new education policy: విజయవాడలో విద్యార్థి సంఘాలు చేపట్టిన బంద్ ఉద్రిక్తతకు దారి తీసింది. మొగల్రాజపురంలోని బోయపాటి రామకృష్ణయ్య నగర పాలక సంస్థ పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేపట్టగా.. పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో విద్యార్థి సంఘాలు ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళన చేశాయి. పాఠశాలలు మెుదలై.. 2 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పుస్తకాలు పంపిణీ చేయలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగ సమస్యల్ని అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని బాపట్లలో విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. సీఎం జగన్ ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ విజయనగరంలో విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని నిరసన తెలుపుతున్న విద్యార్థినులను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి వాహనంలో ఎక్కించారు. విశాఖలోని ప్రభుత్వ మహిళా కళాశాల నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచి, విద్యా వసతి, విద్యా దీవెన అర్హులందరికీ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. సర్కార్ నిర్ణయాలతో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.