ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అనధికార రిజర్వాయర్లలో నిల్వ చేసేవి నికర జలాలే..! - Krishna River Management Board latest news

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రిజర్వాయర్ల యాజమాన్య కమిటీ కొత్త ప్రతిపాదనలు ముందుకు తెచ్చింది. నీటి వినియోగానికి సంబంధించి 2021 జులై తర్వాత చేపట్టిన అనధికార రిజర్వాయర్లలో నిల్వ చేసే నీటినీ నికర జలాలుగానే పరిగణిస్తామని పేర్కొంది. ఈ ప్రతిపాదనలు రెండు తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపనున్నాయి.

storage in unauthorized reservoirs is net water
అనధికార రిజర్వాయర్లలో నిల్వ చేసేవి నికర జలాలే

By

Published : Jul 7, 2022, 9:19 AM IST

నీటి వినియోగానికి సంబంధించి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రిజర్వాయర్ల యాజమాన్య కమిటీ(ఆర్‌ఎంసీ) కొత్త ప్రతిపాదనలు ముందుకు తెచ్చింది. కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన 2021 జులై తర్వాత చేపట్టిన అనధికార రిజర్వాయర్లలో నిల్వ చేసే నీటిని మిగులు జలాల నుంచి లెక్కించినా.. నికర జలాలుగానే పరిగణిస్తామని పేర్కొంది. అయితే, గెజిట్‌ నోటిఫికేషన్‌ రాకముందే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి, 2021 జులై తర్వాత పూర్తి చేసిన అనధికార రిజర్వాయర్లలో నిల్వ చేసే నీటినే తాజా ప్రతిపాదన ప్రకారం పరిగణనలోకి తీసుకొంటారా లేక గెజిట్‌ నోటిఫికేషన్‌ తర్వాత నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టులకు ఇది వర్తిస్తుందా అన్నదానిపై స్పష్టత లేదు. ప్రధాన నదిపై ఉన్న రిజర్వాయర్లు కాకుండా పక్కకు నీటిని మళ్లించి నిల్వ చేసిన తర్వాత ఆ ప్రాంతంలో వర్షాలు కురిసి నీటిని దిగువకు వదలాల్సి వస్తే.. వాటిని మిగులు జలాల కింద వినియోగించుకోలేకపోయిన వాటిగా జమ కట్టేలా మరో ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదనలు రెండు రాష్ట్రాలపై ప్రభావాన్ని చూపనున్నాయి. జులై ఒకటిన బోర్డు ఆధ్వర్యంలోని రిజర్వాయర్ల యాజమాన్య కమిటీ మూడో సమావేశం జరిగింది. ఇందులో చర్చించిన అంశాలు, తీసుకొన్న నిర్ణయాలను కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లకు బుధవారం పంపింది.

శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల నిర్వహణకు సంబంధించి, రూల్‌కర్వ్‌ అమలుపై మొదటి రెండు సమావేశాల్లో తీసుకొన్న నిర్ణయాలను తెలంగాణ పరిశీలించాల్సి ఉన్నందున వచ్చే సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. అయితే, మిగులు జలాల వినియోగం, వీటిని ఎలా లెక్కగట్టాలన్నదానిపై తాజా సమావేశంలో వివరంగా చర్చించినట్లు రెండు రాష్ట్రాలకు రాసిన లేఖలో బోర్డు తెలిపింది. వినియోగం రాష్ట్రాల వారీగా లెక్కగట్టడంతోపాటు నికరజలాలు, మిగులు జలాల వినియోగం వేర్వేరుగా పరిగణనలోకి తీసుకొంటారు. మిగులు జలాలు ఉన్న రోజులు మినహా మిగిలిన నీటి వినియోగం మొత్తాన్ని నికర జలాలుగానే పరిగణిస్తారు. వరదల సమయంలో ప్రధాన కృష్ణాలోని రిజర్వాయర్లన్నీ నిండి గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నప్పుడు వినియోగించే నీటిని మిగులు జలాలుగా పేర్కొన్నారు. ప్రధాన కృష్ణాలో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతలతోపాటు దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజీని కూడా పరిగణనలోకి తీసుకొని మిగులు ఎన్నిరోజులు ఉందన్నది కృష్ణా బోర్డు ప్రకటిస్తుంది. ఆ సమయంలో జరిగిన వినియోగం అంతా మిగులు జలాల కిందే లెక్క.

ఆ ప్రాజెక్టులకు మరిన్ని సమస్యలు..

ప్రస్తుతం కృష్ణా బేసిన్‌లో 75 శాతం నీటిలభ్యత కింద వినియోగం జరుగుతోంది. బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ అవార్డు తీర్పు అమల్లోకి వస్తే 65 శాతం నీటి లభ్యత కింద వినియోగం అమల్లోకి వస్తుంది. రిజర్వాయర్ల నిల్వలలోనూ మార్పు వస్తుంది. మిగులు జలాలు ఇంకా తగ్గి.. వీటి ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులు మరిన్ని సమస్యలను ఎదుర్కొంటాయి. దీంతోపాటు కేంద్ర గెజిట్‌ నోటిఫికేషన్‌ నేపథ్యంలో నిర్మాణంలో ఉన్న అనధికార ప్రాజెక్టులను నిలిపివేయాల్సి వస్తుంది. బోర్డు తాజా ప్రతిపాదలపై రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది. రిజర్వాయర్ల యాజమాన్య కమిటీ తదుపరి సమావేశాన్ని ఈ నెల 15న జరపాలని బోర్డు నిర్ణయించింది. అయితే, 13 నుంచి 15 వరకు బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ సమావేశాలు జరగనున్నందున రెండు రాష్ట్రాల నీటిపారుదల అధికారులు దిల్లీలో ఉండే వీలుంది. ఈ నేపథ్యంలో యాజమాన్య కమిటీ సమావేశం వాయిదాపడే అవకాశం ఉంది.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details