Andhra Pradesh Gram Panchayats గ్రామపంచాయతీల పేరుతో తెరిచిన బ్యాంకు ఖాతాల్లోనే ఆర్థిక సంఘం నిధులను జమ చేయాలన్న కేంద్రం ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం బేఖాతర్ చేసింది. కేంద్రం తాజాగా కేటాయించిన రూ.379 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులను మరోసారి పీడీ ఖాతాలో జమచేయాలని నిర్ణయించింది. వీటిని పంచాయతీలు చెల్లించాల్సిన విద్యుత్తు ఛార్జీల బకాయిల కింద విద్యుత్తు పంపిణీ సంస్థలకు మరోసారి మళ్లించనున్నారు. దీనిపై ఆర్థికశాఖ ఈ నెల 19న జారీ చేసిన మెమో మంగళవారం వెలుగులోకి వచ్చింది. స్థానిక సంస్థల నుంచి విద్యుత్తు ఛార్జీల బకాయిల విషయమై ఈ నెల 18న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఇంధనశాఖ అధికారులు బీఅండ్‌ఎల్‌ఎఫ్ కార్యదర్శితో సమావేశమై చర్చించినట్లు మెమోలో పేర్కొన్నారు.
ఆర్థిక సంఘం నిధులను బ్యాంకు ఖాతాలకు బదులుగా పీడీ ఖాతాలకు సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు అందులో ప్రస్తావించారు. ఇందుకోసం 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల ప్రక్రియకు సంబంధించిన జీవోలు 3591, 3628లో సవరణలు చేస్తున్నట్లు మెమోలో ఆర్థికశాఖ పేర్కొంది. ఈ పరిణామాలతో రాష్ట్రంలోని సర్పంచులు మరోసారి ఖంగుతిన్నారు. గతంలోనే 14, 15 ఆర్థిక సంఘం నిధుల్లో నుంచి రూ.1,244 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించడంతో అప్పట్లో సర్పంచుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. కేంద్రానికీ ఫిర్యాదులు వెళ్లడంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ స్పందించింది. ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకే జమయ్యేలా ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిచి వాటిని కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ సిస్టం(పీఎఫ్‌ఎంఎస్)కి మ్యాపింగ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌శాఖ అధికారులు రాష్ట్రంలోని అన్ని పంచాయతీల పేరుతో ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిపించారు.