ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Corona vaccination: గ్లోబల్ టెండర్ల గడువు పెంచే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం - ఏపీ కొవిడ్ వ్యాక్సినేషన్ గ్లోబల్ టెండర్ల వార్తలు

కరోనా వ్యాక్సినేషన్ కొనుగోళ్ల కోసం పిలిచిన బిడ్ల గడువును మరో రెండు వారాలు పెంచాలని భావిస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ తెలియచేసింది. ఇవాళ సాయంత్రం 5 గంటలతో గడువు ముగిసినా ఒక్క టెండరు కూడా దాఖలు కాకపోవటంపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ వ్యాక్సిన్​లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేలా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు.

covid vaccination
covid vaccination

By

Published : Jun 3, 2021, 10:58 PM IST

కరోనా వ్యాక్సిన్ కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించిన గ్లోబల్ టెండర్ల గడువును మరో రెండు వారాలు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 3 తేదీ సాయంత్రం 5 గంటలతో బిడ్ల దాఖలుకు గడువు ముగియటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత నెలలో నిర్వహించిన ప్రీబిడ్ సమావేశానికి మూడు ఫార్మా కంపెనీలు హాజరైనప్పటికీ ఒక్క సంస్థ కూడా బిడ్లను దాఖలు చేయకపోవటంతో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ విషయమై కేంద్రీకృత విధానం అమలు అయ్యేలా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాల్సిందిగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ లేఖ రాశారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో కేంద్రం ఇచ్చిన కోటా సరిపోకపోవటంతో త్వరితగతిన వ్యాక్సిన్​లు వేయాలనే ఉద్దేశంతో గ్లోబల్ టెండర్లు పిలిచినట్టు రాష్ట్రప్రభుత్వం చెబుతోంది.

18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న యువతకు వ్యాక్సినేషన్ విషయంలో రాష్ట్రాలే బాధ్యత తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేయటంతో ఉచితంగా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించారు. రాష్ట్రంతో సహా దేశవ్యాప్తంగా చాల రాష్ట్రాల్లో టెండర్లు పిలిచినా బిడ్లు దాఖలు కాలేదని వైద్యారోగ్యశాఖ తెలిపింది. వ్యాక్సిన్ కొనుగోళ్ల విషయంలో రాష్ట్రాల నియంత్రణ లేదని అందరికీ తెలిసిందని..ఫార్మా కంపెనీలు బిడ్లు దాఖలు చేయకపోవటమే దీనికి ప్రత్యక్ష నిదర్శనమని వైద్యారోగ్యశాఖ అభిప్రాయపడింది.

జనవరి 16న మొదలైన వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రమే మొదలుపెట్టినందున తదుపరి ప్రక్రియను కూడా అలాగే కొనసాగేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ లేఖ రాశారని వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఏకే సింఘాల్ పేర్కోన్నారు. బిడ్ దాఖలు గడువు పెంచినా ఫార్మా కంపెనీలు అప్పుడు కూడా బిడ్లు దాఖలు చేస్తాయా లేదా అనేది వేచి చూడాలని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.


ఇదీ చదవండి:Niti Aayog Ranks: 2020-21 స్థిర ఆర్థికాభివృద్ధిలో మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్

ABOUT THE AUTHOR

...view details