కర్ణాటకలోని నగరాలు, పట్టణాల్లో అమలు చేస్తున్న పన్నుతో పోలిస్తే, మన రాష్ట్రంలో అమల్లోకి తేనున్న పన్ను చాలా తక్కువని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కొత్త ఆస్తిపన్ను విధానంపై ‘ఈనాడు’ పత్రికలో బుధవారం ప్రచురితమైన కథనానికి స్పందనగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. అద్దె ఆధారిత విధానంలో ఐదేళ్లకు ఒకసారి పన్ను సవరించాలని చట్టం చెబుతున్నా.. రాష్ట్రంలో నివాస భవనాలకు 2002లో, నివాసేతర ఆస్తులకు 2007లో చివరిసారి పన్నులు సవరించారని తెలిపింది. ఐదేళ్లకు ఒకసారి పన్ను సవరించి ఉంటే.. రిజిస్ట్రేషన్ విలువ ఆధారిత విధానంలో నిర్ణయించే పన్నుకంటే అదే ఎక్కువ ఉండేదని తెలిపింది.
Property Tax: కొత్త విధానంలోనే ఆస్తిపన్ను భారం తక్కువ - కొత్త ఆస్తిపన్నుపై స్పందించిన ఏపీ ప్రభుత్వం
నగరాలు, పట్టణాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న అద్దె ఆధారిత ఆస్తిపన్ను విధానంతో పోలిస్తే.. కొత్తగా ప్రవేశపెడుతున్న రిజిస్ట్రేషన్ విలువ ఆధారిత పన్ను విధానంలోనే ప్రజలపై తక్కువ భారం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఎఫ్‌ఆర్‌బీఎం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల్ని అనుసరించే పన్ను సంస్కరణలు చేపట్టినట్లు తెలిపింది. కర్ణాటక, మహారాష్ట్రల్లో అమలవుతున్న రిజిస్ట్రేషన్ విలువ ఆధారిత పన్ను విధానాన్ని అధికారుల బృందాలు అధ్యయనం చేశాకే.. రాష్ట్రంలోనూ అమలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పింది.
‘తిరుపతిలో 100 చ.మీ.ల ప్లింత్ ఏరియా ఉన్న నివాస భవనానికి 2002లో చ.మీ.కి అద్దె నెలకు రూ.7.5గా నిర్ణయించారు. దాని ప్రకారం ఆ భవనానికి వార్షిక పన్ను ఏటా రూ.2,087గా ఖరారు చేశారు. అద్దె ఆధారిత విధానంలో ఆ ఇంటికి ఇప్పుడు ఆస్తిపన్ను సవరిస్తే.. చ.మీ.కి నెలకు రూ.24 అద్దె నిర్ణయించాల్సి వచ్చేది. ఆ ప్రకారం వార్షిక పన్ను రూ.6,756 అవుతుంది. అదే రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా పన్ను ఖరారు చేస్తే వార్షిక పన్ను రూ.6,341 అవుతుంది. కానీ మొదటి సంవత్సరం 15 శాతమే పన్ను పెంచుతున్నాం కాబట్టి.. కొత్తపన్ను రూ.2,400 మాత్రమే అవుతుంది’ అని ప్రభుత్వం వెల్లడించింది.
ఇదీ చదవండీ..గ్రూప్-1 మినహా ఏపీపీఎస్సీ పరీక్షలకు ప్రిలిమ్స్ ఉండదు