ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రూ.800 కోట్లు..ఐదు జిల్లాలు..పది టెండర్లు

By

Published : Sep 12, 2020, 8:27 AM IST

Updated : Sep 12, 2020, 12:04 PM IST

రూ.800 కోట్లతో చేపట్టనున్న రహదారులు పనులకు రాష్ట్రప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. వీటిని చేజిక్కించుకోవడానికి కొన్ని గుత్తేదారుల సంస్థలు సిద్ధం చేసుకున్న ముందస్తు వ్యూహం సఫలమైనట్లు కనిపిస్తోంది. అయిదు జిల్లాలకు సంబంధించి నిర్వహించిన టెండర్లలో ఒక్కో జిల్లా నుంచి కేవలం రెండేసి చొప్పున మాత్రమే దాఖలవడం దీనికి నిదర్శనమన్న భావన వ్యక్తమవుతోంది.

The state government has invited tenders for road works to be undertaken at a cost of Rs 800 crore.
ఫలించిన గుత్తేదారుల ముందస్తు వ్యూహం

అవి దాదాపు రూ.800 కోట్లతో చేపట్టనున్న రహదారుల పనులు. న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ) రుణంతో చేపట్టే ఈ పనులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. వీటిని చేజిక్కించుకోవడానికి కొన్ని గుత్తేదారుల సంస్థలు సిద్ధం చేసుకున్న ముందస్తు వ్యూహం సఫలమైనట్లు కనిపిస్తోంది. అయిదు జిల్లాలకు సంబంధించి నిర్వహించిన టెండర్లలో ఒక్కో జిల్లా నుంచి కేవలం రెండేసి చొప్పున మాత్రమే దాఖలవడం దీనికి నిదర్శనమన్న భావన వ్యక్తమవుతోంది. పైగా తమ కనుసన్నలు దాటి ఎవరైనా టెండర్లు వేస్తారేమోనని కొన్ని సంస్థలు సంబంధిత కార్యాలయాల వద్ద నిఘా పెట్టాయి. ఇతర గుత్తేదారు సంస్థల ప్రతినిధులు వస్తే ఎందుకొచ్చారని ఆరా తీశాయి. చివరకు నిర్ణీత గడువులోగా తమ సంస్థల పత్రాలే దాఖలయ్యేలా చూసుకున్నాయి.

ఇందులోభాగంగానే రాయలసీమకు చెందిన కొందరు వ్యక్తులు విజయవాడలోని సీఈ కార్యాలయంలో శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ తిష్ఠ వేశారు. టెండర్ల గడువు ముగిసిన తర్వాతే వారు అక్కడి నుంచి వెళ్లారు. జిల్లా మొత్తాన్ని ఒక ప్యాకేజీగా నిర్ణయించి రహదారుల పనులను చేపట్టేందుకు ఈ టెండర్లను పిలిచారు. అనంతపురం జిల్లాలో రూ.128.39 కోట్లు, కడపలో 122.19 కోట్లు, కర్నూలులో రూ.228.82 కోట్లు, చిత్తూరులో రూ.126.15 కోట్లు, ప్రకాశంలో 187.21 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచారు. ఆన్‌లైన్‌లో దాఖలుకు శుక్రవారం మధ్యాహ్నం వరకు గడువు ఉండటంతో పలు సంస్థలు బిడ్లు వేశాయి. సాంకేతిక బిడ్లను 14న తెరవనున్నారు.

గడువు ముగిసేలోగా బ్యాంకు గ్యారంటీ, ధరావతు, పవర్‌ ఆఫ్‌ అటార్నీ పత్రాలను జిల్లా ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కార్యాలయంలో లేదా విజయవాడ సీఈ కార్యాలయంలో అందజేయాలనే నిబంధన విధించారు. దీని వల్ల టెండర్లు ఎవరు వేశారో తెలుస్తోంది. అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు రెండేసి టెండర్లు వేసిన సంస్థలు వాటి పత్రాలను విజయవాడ సీఈ కార్యాలయంలో అందజేశాయి. కర్నూలు జిల్లా పనులకు బిడ్లు వేసిన రెండు సంస్థలూ అక్కడి ఎస్‌ఈ కార్యాలయంలోనే ఇచ్చాయి. ప్రకాశం జిల్లా పనులకు ఓ సంస్థ ఎస్‌ఈ కార్యాలయంలోనూ, మరో సంస్థ సీఈ కార్యాలయంలోనూ అందజేసింది. చిత్తూరు, కడప జిల్లాల్లో అదే ప్రాంతానికి చెందిన ఓ ముఖ్య నేతకు చెందిన సంస్థ, అనంతపురంలో అదే జిల్లాకు చెందిన సంస్థకు ఈ పనులను దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రకాశం జిల్లాలో మాత్రం కడపకు చెందిన ఓ సంస్థకు దక్కవచ్చు.

ఇదీ చదవండి:

చిక్కీల ముసుగులో రూ.14 కోట్లకు టెండర్‌

Last Updated : Sep 12, 2020, 12:04 PM IST

ABOUT THE AUTHOR

...view details