ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 26, 2022, 5:48 AM IST

ETV Bharat / city

'ఆ చట్టం అమలుకు చర్యలు తీసుకుంటున్నాం'

అధికార భాషా చట్టం అమలుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుతం... హైకోర్టులో అఫిడవిట్‌ వేసింది. సరైన స్ఫూర్తితో అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని పేర్కొంది. పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో జారీచేసేలా సర్కారును ఆదేశించాలని, అధికార భాషా చట్టాన్ని సరైన స్ఫూర్తితో అమలు చేయాలని కోరుతూ గుంటుపల్లి శ్రీనివాస్‌ హైకోర్టులో పిల్‌ వేశారు.

హైకోర్టు
హైకోర్టు

జిల్లా స్థాయిలో 70 నుంచి 80శాతం అధికారిక కార్యకలాపాలు(ఉత్తర ప్రత్యుత్తరాలు, ఆదేశాలు వగైరా) తెలుగులోనే జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ వేసింది. అధికార భాషా చట్టం అమలు తీరును పర్యవేక్షించేందుకు 2020లో ఏర్పాటు చేసిన కమిషన్‌ అధ్యయనంలో ఈ విషయం తేలిందని వెల్లడించింది. అధికార భాషా చట్టం సెక్షన్‌ 3కి అనుగుణంగా జారీచేసిన నోటిఫికేషన్‌ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని పేర్కొంది. ఈ చట్టం అమలుకు చర్యలు తీసుకుంటున్నామని, సరైన స్ఫూర్తితో అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని పేర్కొంది. పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో జారీచేసేలా సర్కారును ఆదేశించాలని, అధికార భాషా చట్టాన్ని సరైన స్ఫూర్తితో అమలు చేయాలని కోరుతూ గుంటుపల్లి శ్రీనివాస్‌ హైకోర్టులో పిల్‌ వేసిన విషయం తెలిసిందే. సోమవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేశామన్నారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు సమాధానం వేసేందుకు సమయం కోరడంతో విచారణను జూన్‌ 13కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం సోమవారం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది.

ABOUT THE AUTHOR

...view details