సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు పోస్టింగ్ ఇచ్చింది. కమిషనర్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీగా ఆయనను నియమిస్తూ.. ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న జి .విజయ్ కుమార్ ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ స్థానంలో ఏబీవీని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు ఇచ్చారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనపై ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేయగా... మేనెల 19న సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేశారు. అప్పటి నుంచి ఏబీవీ.... పోస్టింగ్ కోసం ఎదురుచూస్తుండగా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ బాధ్యతలు అప్పగిస్తూ ఇవాళ ఉత్తర్వులు వెలువడ్డాయి.
అసలేం జరిగిందంటే...
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సర్వీస్ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకోవటంపై అప్పట్లో ఏపీ ప్రభుత్వం ఆయనను విధుల్లోంచి తొలగించింది. భద్రతా ఉపకరణాలు కొనుగోలులో అతిక్రమణలు జరిగాయని, ప్రజాప్రయోజనాలరీత్యా ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినట్లు ప్రభుుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. సస్పెన్షన్‌కు గురైన ఏబీ వెంకటేశ్వరరావు 1989 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. అయితే, ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2020 మే 22న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్‌ఎల్‌పీ)ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్ కొనసాగించడం కుదరదని పేర్కొంది. ఏబీవీని మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు జస్టిస్ ఏ.ఎం.ఖన్విల్కర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. రెండేళ్ల సస్పెన్షన్ 2022 ఫిబ్రవరి 7తో ముగిసిందని.. ఆ తర్వాత రోజు నుంచి ఏబీ వెంకటేశ్వరరావుకు అన్ని రకాల ప్రయోజనాలు వర్తిస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏబీవీకి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది.
ఇదీ చదవండి:CM JAGAN REVIEW MEETING : త్వరలో రాష్ట్రంలో మూడు లక్షలకు పైగా ఉద్యోగాలు