కరోనా(COVID), లాక్డౌన్(LOCKDOWN) ప్రభావం కారణంగా రాష్ట్ర ఖజానా కోల్పోయిన ఆదాయం క్రమంగా పెరుగుతోంది. లాక్డౌన్ అమలుతో మే నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం(INCOME TO TELANGANA) బాగా పడిపోయింది. మే నెలలో సర్కారు ఖజానాకు రూ.5,169 కోట్ల ఆదాయం వచ్చింది. ఆగస్టు గణాంకాల వరకు పరిశీలిస్తే అత్యధికంగా జూలైలో రూ.8,357 కోట్ల ఆదాయంగా సమకూరింది. ఏప్రిల్లో రూ.6,840 కోట్లు, జూన్లో రూ.6,871 కోట్లు.. ఆగస్టులో 7831 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంగా వచ్చాయి.
రాబడి వచ్చిందిలా..
కేంద్రం నుంచి జూన్ నెలలో అత్యధికంగా 3,559 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా జూన్ నెలలో ఎక్కువగా రూ.10,429 కోట్లు సమకూరాయి. 2021-22 ఆర్థికసంవత్సరంలో రాష్ట్ర సొంత పన్నుల ద్వారా ఆగస్టు నెలాఖరు వరకు రూ.33,061 కోట్లు వచ్చాయి. అమ్మకం పన్ను ద్వారా రూ.10,617 కోట్లు, జీఎస్టీ ద్వారా రూ.10,921 కోట్లు వచ్చాయి. ఎక్సైజ్ ద్వారా రూ.6,046 కోట్లు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.3,701 కోట్లు, రవాణా పన్ను ద్వారా రూ.1,573 కోట్లు ఖజానాకు చేరాయి. పన్నేతర ఆదాయం రూ.2,006 కోట్ల రూపాయలు చేకూరింది.