ఎఫ్ఆర్బీఎమ్ పరిమితి పెంపులో వెసులుబాటు వినియోగించుకునే దిశగా... రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 4 రంగాల్లో సంస్కరణలు తీసుకురావాలన్న కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు ...ఉచిత వ్యవసాయ విద్యుత్ పొందుతున్న రైతులకు నగదు బదిలీ చేయాలని నిర్ణయించింది. జమ చేసే మొత్తాన్ని..... రైతులు నేరుగా డిస్కంలకు చెల్లించేలా చూడాలన్న కేంద్ర నిబంధనలకు అనుగుణంగా విధివిధానాలు రూపొందించింది. రైతు రూపాయి కూడా చెల్లించకుండా ప్రభుత్వం ఖాతాలో జమ చేసిన మొత్తం నేరుగా డిస్కంలకు వెళ్లేలా మార్గదర్శకాలు రూపొందించారు. దీంతో రైతుకు ప్రభుత్వం నుంచి ఎంతసాయం అందుతుందనే విషయం నేరుగా తెలియడంతోపాటు...రైతే నేరుగా బిల్లు చెల్లించడంతో నాణ్యమైన విద్యుత్‌ను డిస్కంల నుంచి డిమాండ్ చేసే అవకాశం ఏర్పడుతుంది. సంస్థలు కొనుక్కునే విద్యుత్ వినియోగం, వృథా లెక్కలను సైతం తెలుసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి ఒక్క జిల్లాలోనైనా ఏర్పాటు చేయనుండగా...వచ్చే ఏడాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి రానుంది.
- ప్రత్యేక బ్యాంకు ఖాతా...
రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్న నగదు బదిలీ కోసం రైతులు పేరిట ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తెరవనున్నారు. ఇప్పటికే ఉన్న ఖాతాల్లో నగదు జమచేస్తే...బ్యాంకులు పాత బకాయిల కింద జమ చేసుకునే అవకాశం ఉందని గ్రహించిన ప్రభుత్వం....నగదు బదిలీ కోసం ప్రత్యేకంగా మరో బ్యాంకు ఖాతా తెరవనుంది. రైతులు వినియోగించిన విద్యుత్‌కు అనుగుణంగా ప్రభుత్వం వారి ఖాతాల్లో నగదు జమ చేయగానే...రైతు ప్రమేయం లేకుండానే ఆ సొమ్ము డిస్కంలకు వెళ్లిపోతుంది. దీనికోసం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు అవకాశం ఉన్న చోట స్మార్ట్‌మీటర్లు, ఐఆర్డీఏ మీటర్లు బిగించనున్నారు. దీనికోసం ప్రభుత్వం సుమారు 15 వందల కోట్లు ఖర్చుచేయనుంది. వీటికి అవసరమైన నిధులను రాయితీ రూపంలో ప్రభుత్వమే ఇవ్వనుంది. ప్రస్తుతం ఉన్న దాదాపు 18 లక్షల కనెక్షన్ల ద్వారా... ఏటా 12 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతుండగా.....రాయితీ కింద 8 వేల 353 కోట్ల ఖర్చు చేస్తున్నట్లు ఇంధన శాఖ తెలిపింది. విద్యుత్ నగదు బదిలీ పథకం అమలు, పర్యవేక్షణ, ప్రచారం, సమస్యల పరిష్కారాల కోసం... ప్రభుత్వం కమిటీలు నియమిస్తూ ఆదేశాలిచ్చింది. దీనివల్ల రైతులకు ఎలాంటి నష్టమూ ఉండబోదని......స్పష్టం చేసింది.