ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 24, 2021, 9:02 AM IST

ETV Bharat / city

'రెండేళ్లలో రైతులకు 85వేలకోట్ల లబ్ధి'

గత రెండేళ్లలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా రైతులకు రూ.85వేల కోట్ల లబ్ధి చేకూర్చినట్లు రాష్ట్రప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. వైఎస్ఆర్ రైతు భరోసాతోపాటు పీఎం కిసాన్, సున్నా వడ్డీ మెుదలైన పథకాల కింద అన్నదాతలకు అందించిన వివరాలను తెలియజేసింది.

Rs 85,000 crore to farmers
'రెండేళ్లలో రైతులకు 85వేలకోట్ల లబ్ధి'

వివిధ సంక్షేమ పథకాల ద్వారా రైతులకు గత రెండేళ్లలో రూ.85 వేల కోట్ల లబ్ధి చేకూర్చినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. 'వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కింద ఒక్కో రైతుకు ఏటా రూ.13,500 వంతున.. అయిదేళ్లలో రూ.67,500 అందిస్తాం. పీఎం కిసాన్‌ కింద 52.38 లక్షల మంది రైతులకు రూ.17,030 కోట్లను వెచ్చించాం. రూ.14 వేల కోట్లతో బహుళ వినియోగ సేవా కేంద్రాల ద్వారా కోల్డ్‌ స్టోరేజీలు, గిడ్డంగులు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. అమూల్‌ ద్వారా పాడి రైతుకు లీటర్‌ పాలకు గతంలో కంటే రూ.5-15 వరకు అదనంగా లభించేలా చేస్తాం' అని తెలిపింది.

'వరి పండించే రైతులకు రూ.27,028 కోట్లు, ఇతర పంటలకు రూ.5,964 కోట్లతో గిట్టుబాటు ధర కల్పించాం. సున్నా వడ్డీ పథకం కింద 67.50లక్షల మంది రైతులకు 1,261కోట్లను ఖర్చు చేశాం. ఉచిత పంటల బీమా పథకం కింద 15.67 లక్షల మంది రైతులకు రూ.4,113.70 కోట్లు చెల్లించాం. 2020 ఖరీఫ్‌ పంట నష్టానికిగానూ ఈ నెల 25న 15.15 లక్షల మంది రైతులకు రూ.1,820.23 కోట్లను బీమా పరిహారం కింద ప్రభుత్వం చెల్లిస్తుంది. వైఎస్‌ఆర్‌ జలకళ పథకం కింద సుమారు రూ.4,932 కోట్ల వ్యయంతో 2 లక్షల బోర్లు తవ్విస్తాం' అని వెల్లడించింది.

'వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా కింద 1.19 లక్షల కుటుంబాలకు రూ.332 కోట్ల లబ్ధి చేకూర్చాం. పంటలకు గిట్టుబాటు ధర కల్పించటానికి రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.2 వేల కోట్లతో విపత్తు సహాయ నిధిని ఏర్పాటు చేశాం. వ్యవసాయానికి పగటి పూట తొమ్మిది గంటల విద్యుత్‌ సరఫరా కోసం రూ.17,430 కోట్లు, నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు చేపట్టిన అభివృద్ధి పనులకు రూ.1,700 కోట్లను ఖర్చు చేశాం. శనగ పండించే రైతులకు బోనస్‌గా రూ.300 కోట్లు చెల్లించాం. 10,778 వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా 2020 ఖరీఫ్‌లో 13.96 లక్షల మంది రైతులకు 6.99 లక్షల క్వింటాళ్లు, రబీలో 3.04 లక్షల మంది రైతులకు 2.29 లక్షల క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేశాం’ అని ప్రభుత్వం పేర్కొంది.

ఇదీ చదవండి:

తుపాను దృష్ట్యా ఆక్సిజన్‌ నిల్వ, తయారీపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

ABOUT THE AUTHOR

...view details