ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TEXT BOOKS: పాఠశాల విద్యాశాఖ సరికొత్త నిబంధన.. ప్రైవేటు పాఠశాలలు సైతం.. - ఏపీ తాజా సమాచారం

రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ సరికొత్త నిబంధన తీసుకొచ్చింది. ప్రైవేటు పాఠశాలలు సైతం పాఠ్యపుస్తకాలను తమ వద్దే కొనాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి పాఠ్యప్రణాళిక ప్రకారమే పిల్లలకు బోధిస్తున్నామని, తమకు నచ్చిన పబ్లికేషన్స్‌ పుస్తకాలను కొనుక్కుంటామని పేర్కొంటున్నాయి.

TEXT BOOKS:
TEXT BOOKS:

By

Published : Apr 20, 2022, 5:45 AM IST

ప్రైవేటు పాఠశాలలు సైతం పాఠ్యపుస్తకాలను తమ వద్దే కొనాలంటూ పాఠశాల విద్యాశాఖ సరికొత్త నిబంధన తీసుకొచ్చింది. ప్రైవేటు యాజమాన్యాలన్నీ వారికి అవసరమైన పాఠ్యపుస్తకాల ఇండెంట్‌ను ఆన్‌లైన్‌లో నమోదుచేయాలని ఆదేశించింది. దీంతో ఆయా పాఠశాలలు ఇండెంట్‌ను పంపించాయి. దీనికనుగుణంగా పాఠ్యపుస్తకాల ముద్రణకు విద్యాశాఖ ఆర్డర్లు ఇచ్చింది. పాఠ్యపుస్తకాలను ఆర్టీసీ కార్గో ద్వారా మండల విద్యాధికారుల కార్యాలయాలకు తరలిస్తామని, అక్కడినుంచి తీసుకెళ్లాలనే నిబంధన విధించింది. రాష్ట్రవ్యాప్తంగా 1.80కోట్ల పుస్తకాలు అవసరం కానున్నాయి. గతంలో ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలను మాత్రమే విద్యాశాఖ ముద్రించేది. బయట మార్కెట్‌లో అమ్ముకునే పుస్తకాల ముద్రణను ప్రైవేటు ప్రింటర్లు తీసుకునేవారు. తమ అమ్మకాలనుబట్టి ప్రింటర్లు విద్యాశాఖకు 5శాతం రాయల్టీ చెల్లించేవారు. ఈసారి ఇందుకు భిన్నంగా ప్రైవేటు బడులకు తామే పాఠ్యపుస్తకాలు అందిస్తామనే నిబంధనను విద్యాశాఖ తీసుకొచ్చింది. దీన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి పాఠ్యప్రణాళిక ప్రకారమే పిల్లలకు బోధిస్తున్నామని, తమకు నచ్చిన పబ్లికేషన్స్‌ పుస్తకాలను కొనుక్కుంటామని పేర్కొంటున్నాయి. ఇతర పబ్లికేషన్స్‌ పుస్తకాల వల్ల విద్యార్థులకు అదనపు సమాచారం అందించే వీలుంటుందని వెల్లడిస్తున్నాయి.

పిల్లలు కొనకపోతే ఏం చేయాలి?

చిన్నచిన్న ప్రైవేటు పాఠశాలల పిల్లల్లో కొందరు తమ బంధువులు, సోదరులు చదువుకున్న పాత పాఠ్యపుస్తకాలనే వాడుతారు. ఇలాంటివారు కొత్తవి కొనుక్కోరు. అలాంటప్పుడు ఇండెంట్‌ పెట్టిన అన్ని పుస్తకాలు కొనాలంటే ఎలాగని ప్రైవేటు యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. పుస్తకాల ఇండెంట్‌ ప్రకారం అడ్వాన్సు చెల్లించాలని పాఠశాల విద్యాశాఖ కోరగా ఇందుకు ప్రైవేటు యాజమాన్యాలు నిరాకరించాయి. పాఠశాలలు పునఃప్రారంభమయ్యాక తమ వద్దనున్న విద్యార్థుల సంఖ్య, వారి అవసరాల ఆధారంగా పుస్తకాలు తీసుకుంటామని వివరిస్తున్నాయి. సీబీఎస్‌ఈలో జాతీయ విద్య పరిశోధన, శిక్షణమండలి (ఎన్‌సీఈఆర్టీ) సూచించిన పాఠ్యప్రణాళిక ఉన్న ఏ పబ్లికేషన్‌ పుస్తకాలనైనా వినియోగించేందుకు అవకాశముంది. అలాంటప్పుడు రాష్ట్ర స్థాయిలో ఇదేం నిబంధన? అని ప్రైవేటు పాఠశాలలవారు ప్రశ్నిస్తున్నారు. పాఠ్యప్రణాళిక అమలు చేస్తున్నారా? లేదా? అని పరిశీలించాలే తప్ప ఏ పాఠ్యపుస్తకాలు వాడాలో అధికారులే చెబితే ఎలాగని వాదిస్తున్నారు.

ఇదీ చదవండి:ఆహార భద్రతకు నగదు ముప్పు!

ABOUT THE AUTHOR

...view details