జూరాలకు వరద భారీగా పెరిగింది. కర్ణాటకతో పాటు జూరాల పరీవాహకంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరద నీటి ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో బుధవారం పైనుంచి 67 వేల క్యూసెక్కుల ప్రవాహం రాగా.. జలాశయంలో 9.56 టీఎంసీలు నిల్వ చేసి 9గేట్ల ద్వారా 71 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. సాయంత్రానికి 74 వేల క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. ఇందులో జూరాల నుంచి 71 వేలు కాగా.. మిగిలింది హంద్రీ నది నుంచి వచ్చింది. జలాశయం పూర్తి సామర్థ్యం 8.750 టీఎంసీలు కాగా.. ఇన్‌ఫ్లో 82,818 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 78,898 క్యూసెక్కులుగా ఉంది.
జూరాల ద్వారా నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, జూరాల కుడి, ఎడమ కాలువలు, సమాంతర కాలువలకు నీటిని విడుదల చేశారు. మరోవైపు ఆలమట్టిలోకి 27వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 46 వేల క్యూసెక్కులను బయటకు వదులుతున్నారు. నీటిమట్టాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. నారాయణపూర్ నుంచి 45 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలగా.. నారాయణపూర్ - జూరాల మధ్య, భీమా నది ప్రాంతంలో కురిసే వర్షాలతో జూరాలకు ఎక్కువ ప్రవాహం ఉంది.