పిల్లలమర్రి.. 700 ఏళ్ల చరిత్ర గలిగిన మహావృక్షం. తెలంగాణలో ప్రముఖ పర్యటక కేంద్రం. ఒకప్పుడు ఈ వృక్షం 4 ఎకరాల మేర విస్తరించి ఉండేది. కాలక్రమేణా ఆ విస్తీర్ణం తగ్గిపోయింది. అసలు ఈ చెట్టు మొదలు ఎక్కడో చెప్పడం కష్టమే. ఏది మొదటి కాండమో ఏది శాఖో గుర్తించలేము. ఏటా ఈ వృక్షాన్ని చూసేందుకు లక్షల మంది సందర్శకులు వెళ్తుంటారు. అక్కడ ఎన్నో సినీ గీతాలనూ చిత్రీకరించారు.
కొత్త చిగుళ్లతో మహావృక్షం
రెండేళ్ల కిందట కొమ్మలు కూలి, చెదలు సోకి, తెల్లపుండు రోగంతో దాదాపు శిథిలావస్థకు చేరుకుంది. అలాంటి వృక్షానికి అటవీశాఖ చికిత్స చేసి పునరుజ్జీవం అందించింది. ప్రస్తుతం పిల్లలమర్రికి సుమారు 45 చోట్ల కొత్త ఊడలొచ్చాయి. 35 చోట్ల కొమ్మలు నేలపై వాలకుండా బలంగా తయారయ్యాయి. కొమ్మలు, రెమ్మలు కొత్త చిగుళ్లతో పచ్చదనాన్ని సంతరించుకుని పిల్లలమర్రి కోలుకుంది.
చికిత్స ఫలితంగా...
సరిగ్గా రెండేళ్ల కిందట పిల్లలమర్రిలోని భారీవృక్షం కూలిపోయింది. కారణాలేమిటో తెలుసుకునేందుకు వచ్చిన కలెక్టర్ రొనాల్డ్ రోస్.. తక్షణమే సందర్శనకు అనుమతి నిలిపివేశారు. అటవీశాఖకు చికిత్స బాధ్యత అప్పగించారు. వెంటనే వారు చెదలు నివారించి, నిరంతరం నీటి వసతి కల్పించారు. చెట్టు పురోగతిని ఎప్పటికప్పుడు గమనిస్తూ చికిత్స చేస్తూ వచ్చారు. ఏడాదిన్నర కాలంగా అందిస్తున్న చికిత్స ఫలితంగా ప్రస్తుతం పిల్లలమర్రి పూర్తిగా కోలుకుందని జిల్లా అటవీశాఖ అధికారి తెలిపారు.