ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈ-టెండర్‌ ద్వారా లీజుకు ఇచ్చే యోచన!

ఏడాది కాలంగా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) పర్యవేక్షణలో జరుగుతున్న ఇసుక తవ్వకాలు, విక్రయాలను ప్రైవేటుకు అప్పగించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇసుక విధానంలో మార్పుచేర్పులపై ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ దీనిపై అధ్యయనం చేస్తోంది.

the-proposal-to-privatize
the-proposal-to-privatize

By

Published : Sep 18, 2020, 8:06 AM IST

గత ఏడాది సెప్టెంబరు 5 నుంచి రాష్ట్రంలో కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. నదులు, పట్టా భూములు, జలాశయాల పరిధిలో మేటలు వేసిన ఇసుకను తవ్వి, ఏపీఎండీసీ ద్వారా విక్రయిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఇసుక బుక్‌ చేసుకున్న వారికి ఇంటికే సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు ఇసుక తవ్వకాలు, విక్రయాలను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే విధానంపై కసరత్తు చేస్తున్నారు. ఏ విధానం వల్ల ప్రభుత్వానికి అధిక రాబడి ఉంటుందనేది లెక్కలు వేస్తున్నారు. నలుగురు మంత్రులు, గనులశాఖ, ఏపీఎండీసీ అధికారులు ఇప్పటికే పలు దఫాలు సమావేశమై ఇసుక విధానంపై చర్చించారు. ఈ కమిటీ ముందు ప్రస్తుతం రెండు ప్రతిపాదనలు ఉన్నాయి.

ఇవీ ప్రతిపాదనలు

మొదటి ప్రతిపాదనలో.. ఇసుక తవ్వకాలు, విక్రయాల వ్యవహారమంతా ప్రైవేటుకు అప్పగించాలని సూచించారు. ఈ-టెండర్లు పిలిచి, ప్రభుత్వానికి ఎక్కువ ధర చెల్లిస్తామని ముందుకొచ్చే వారికి అప్పగించాలని పేర్కొన్నారు. గనులశాఖ రీచ్‌లను గుర్తిస్తే వాటిలో టెండరు దక్కించుకున్న గుత్తేదారులు ఇసుక తవ్వి, ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వారికి విక్రయించాలి. అయితే ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇసుక విక్రయించాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రస్తుత విధానం కంటే ప్రభుత్వానికి రూ.150 కోట్ల వరకు అదనపు ఆదాయం ఉంటుందని అంచనా వేసినట్లు తెలిసింది.

*రెండో ప్రతిపాదనలో.. ఇప్పుడున్న ఇసుక విధానమే అవలంబించాలని సూచించారు. అయితే ఇంటికి సరఫరాపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వినియోగదారుడే తనకు నచ్చిన వాహనంలో ఇసుక తీసుకెళ్లే అవకాశం ఇవ్వాలన్నారు.

*ఇసుక తవ్వకాలు, విక్రయాలను ప్రైవేటుకు అప్పగిస్తే దందా మొదలవుతుందని, రాజకీయ జోక్యం ఎక్కువవుతుందని పాలసీ కమిటీలోని కొందరు అభిప్రాయపడినట్లు సమాచారం. మరికొందరు మాత్రం ఇసుక రీచ్‌లను ప్రైవేటుకు అప్పగించాలని గట్టిగా పట్టుబడుతున్నట్లు తెలిసింది. ఇవన్నీ ప్రతిపాదనలేనని, దీనిపై సీఎం తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.

రీచ్‌ల గుర్తింపు అందుకేనా!

ప్రస్తుతం జిల్లాల వారీగా ఇసుక రీచ్‌ల గుర్తింపు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. నదుల్లోని ఓపెన్‌ రీచ్‌లు, పట్టా భూములు, మేటలు కలిపి మొత్తంగా 200 రీచ్‌లు గుర్తించనున్నారు. ప్రైవేటుకు అప్పగించేందుకే ఈ ప్రక్రియ వేగవంతం చేశారా అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చదవండి:హమ్మయ్యా... వారిని కాపాడారు!

ABOUT THE AUTHOR

...view details