Agnipath News : తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరికొంత మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో అడ్మిన్లుగా ఉన్న వాళ్లను ప్రశ్నిస్తున్నారు. అడ్మిన్లుగా ఉండి అందులోని సభ్యులను రెచ్చగొట్టేలా వారు పోస్టింగులు చేసినట్లు గుర్తించారు. ఉత్తరాదిలో జరిగిన విధ్వంసాన్ని చూసి స్ఫూర్తి పొందినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఆందోళనకారుల వెనక ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
కొంత మంది కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు, యువకులను రెచ్చగొట్టినట్లు అనుమానిస్తున్నారు. ఏయే కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల హస్తం ఉందనే వివరాలను సేకరిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తును పరిశీలించాలని ఇప్పటికే అదనపు సీపీ శ్రీనివాస్, టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణను సీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. రైల్వే పోలీసులు ఈ కేసును హైదరాబాద్ పోలీసులకు బదిలీ చేశారు.