హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్ పరిధిలో పెంపుడు తల్లి హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి వెల్లడించారు. ప్రేమ పెళ్లిని అంగీకరించకపోవడంతో పాటు బ్యూటీ పార్లర్ నిర్వహణకు డబ్బులు ఇవ్వకపోవడంతోనే ప్రియుడు, మరొకరితో కలిసి మేరీ క్రిస్టియన్‌ను పెంపుడు కుమార్తె రోమా ప్రణాళిక ప్రకారం హత్య చేసిందని వివరించారు.
'మృతురాలు మేరీ క్రిస్టియన్ నగరంలో మారిక అనే స్కూల్ నిర్వహిస్తున్నారు. ఈమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారిద్దరికి ఇప్పటికే పెళ్లిళ్లు జరిగాయి. అయితే ఆదర్శ భావాలు కలిగిన మేరీ మరో ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుని పోషిస్తోంది. వీరిలో రోమా అనే యువతి మూడు నెలల క్రితం తాను విక్రమ్ శ్రీరాములు అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేయాలని మేరీని కోరింది. ఇందుకు మేరీ అంగీకరించకపోవడంతో ఆమెతో గొడవపడి ఇంట్లోంచి వెళ్లిపోయింది. మళ్లీ ఇటీవల మేరీ వద్దకు వచ్చి.. తాను బ్యూటీపార్లర్ ఏర్పాటు చేసుకుంటానని.. అందుకోసం డబ్బులు ఇవ్వాలని కోరింది. అందుకూ మేరీ ఒప్పుకోకపోవడంతో మేరీని చంపేయాలని నిర్ణయించుకుంది. ప్రియుడితో కలిసి పథకం రచించింది. ఈ నెల 9న మేరీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే.. రోమా తన ప్రియుడు విక్రమ్ శ్రీరాములు కలిసి ఆమెకు ఉరివేసి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని హిమాయత్‌సాగర్ చెరువు పక్కన ఉన్న పొదల్లో పడేశారు' అని డీసీపీ వివరించారు.
వీరికి రాహుల్ గౌతమ్ అనే వ్యక్తి సహకరించాడని డీసీపీ తెలిపారు. మృతురాలి అల్లుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశామన్న ఆయన.. పెంపుడు కూతురు రోమాపై అనుమానంతో విచారించగా హత్య చేసినట్లు అంగీకరించిందని తెలిపారు. మృతదేహాన్ని పడేసిన ప్రాంతాన్ని నిందితురాలు చూపించగా.. స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఈ మేరకు ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు స్పష్టం చేశారు.