రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల శాతం కొద్ది రోజులుగా కొంత తగ్గుముఖం పడుతోంది. గడిచిన రెండు వారాల్లో... ఒక దశలో 17.98 శాతంగా నమోదైన పాజిటివ్ కేసుల రేటు నాలుగైదు రోజులుగా 14-15 శాతం మధ్యే ఉంటోంది. రాష్ట్రంలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల మధ్య 72,229 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. పాజిటివ్ రేటు 14.08 శాతంగా నమోదైంది. కొత్తగా 10,175 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,37,687కి చేరింది. కరోనాతో మరో 68 మంది చనిపోయారు. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో తొమ్మిదేసి మంది.. కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఏడుగురు చొప్పున మృతి చెందారు. అనంతపురం జిల్లాలో ఆరుగురు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో నలుగురు చొప్పున మరణించారు. గుంటూరు జిల్లాలో ఇద్దరు, విజయనగరం జిల్లాలో ఒకరు కరోనాతో మృత్యువాతపడ్డారు. వీటితో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 4,702కి చేరింది.
* ఉభయగోదావరి జిల్లాల్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో వెయ్యికిపైగా కేసులు నమోదైన జిల్లాల్లో తూర్పుగోదావరి (1,412), ప్రకాశం (1,386), పశ్చిమగోదావరి (1,139) ఉన్నాయి.