Papikondalu Boat Tourism resumed: సుదీర్ఘ విరామం తర్వాత పాపికొండలు విహారయాత్ర ఇవాళ్టి నుంచి పునఃప్రారంభమవుతోంది. తెలంగాణలోని కచ్చలూరు బోటు ప్రమాదం తర్వాత ప్రభుత్వం ఆ ప్రాంతాల్లో పర్యాటకాన్ని నిలిపివేయగా.. కొవిడ్ కారణంగా రెండేళ్లుగా పూర్తిస్థాయిలో విహారయాత్ర నిలిచిపోయింది. ఇటీవల రెండు తెలుగురాష్ట్రాలు అనుమతించడంతో యాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ్టి నుంచి పరిమిత సంఖ్యలో బోటులతో యాత్ర ప్రారంభం కానుంది. భద్రాచలానికి 60కిలోమీటర్ల దూరంలో.. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం పోచవరం నుంచి పాపికొండల్లోకి యాత్ర కొనసాగుతోంది. పర్యాటకులు బోటు ద్వారా ప్రయాణిస్తూ గోదావరి పరివాహక ప్రాంతాలను సందర్శిస్తారు. పర్యాటకంతోపాటు పాపికొండలు టూర్ ఎంతోమంది ఆదివాసీలకు ఉపాధి కల్పిస్తోంది. ఒక్కో బోటుపై దాదాపు 20 మందికిపైగా ఆధారపడి జీవిస్తుంటారు. విహారయాత్ర పునఃప్రారంభంతో అక్కడి ప్రజలు తమకు ఉపాధి దొరుకుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గత అనుభవాల దృష్ట్యా ప్రభుత్వ నిబంధనలు, జాగ్రత్తలు పరిశీలించాకే యాత్రకు అధికారులు అనుమతిచ్చారు.
ప్రస్తుతానికి ఆరు బోట్లకు పర్మిషన్ ఇచ్చారు. దానికి పరిమితంగా ఉండేవిధంగా ఎక్కడికక్కడ కంట్రోల్ రూములు, సీసీ కెమెరాలు వంటి అన్ని హంగులతో ప్రభుత్వం ఆదేశాలతో బోర్డు యాజమాన్యం అన్ని సమకూర్చడం జరిగింది. ప్రమాదాలు జరగకుండా ఉండేలా గజ ఈతగాళ్లు, లైఫ్ జాకెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. -రాజేశ్వరరావు. తెలంగాణ టూరిజం ఏజెంట్
papikondalu Yatra : పాపికొండలు యాత్ర ప్రారంభంతో భద్రాచలానికి పర్యాటకుల రద్దీ పెరుగుతుందని అక్కడి స్థానికులు ఆశిస్తున్నారు. కొవిడ్ కారణంగా ఆర్థికంగా చితికిపోయామని... పర్యాటకుల రాకతో ఆలయ పరిసరాల్లోని వ్యాపారాలు పుంజుకుంటాయని అభిప్రాయపడుతున్నారు.
బోటింగ్ అందుబాటులోకి రావడం వల్ల చాలామంది రూములు బుక్ చేసుకుంటారు. అందరూ బాగుంటారు. మాకు, రామాలయానికి ఆదాయం వస్తుంది. మాలాంటి బొమ్మల కొట్ల వాళ్లు కూడా బతుకుతారు. ఇప్పటివరకు చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ పర్మిషన్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. -కృష్ణ, హోటల్ మేనేజ్మెంట్