పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినా సుప్రీంలో విచారణ పేరిట సహాయనిరాకరణ చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.... సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో ఎన్నికలకు సిద్ధమైంది. ఎస్ఈసీ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించింది. పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ రీషెడ్యూల్ నోటిఫికేషన్ జారీ చేయటంతో తదనుగుణ చర్యలకు యంత్రాంగం ఏర్పాట్లు చేసుకుంటోంది. ఎన్నికల నిర్వహణపై సీఎస్ ఆదిత్యనాథ్ దాస్.. పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్‌లతో చర్చించారు. కొందరు కలెక్టర్లతోనూ మాట్లాడినట్టు సమాచారం. ఎస్ఈసీ సూచనల మేరకు 2019 నాటి ఎన్నికల జాబితా సిద్ధం చేయాల్సిందిగా క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించినట్టు తెలుస్తోంది.
రీషెడ్యూల్ నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం... కొందరు సీనియర్ మంత్రులు, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ, ఏజీలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స ప్రకటించారు. మరోవైపు... గతంలో ఎన్నికల విధులు సరిగ్గా నిర్వర్తించని అధికారులను తప్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. అందుకు దస్త్రాలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.