రాష్ట్రంలో పేదలకు పక్కా గృహాల నిర్మాణాన్ని 1983లో ఎన్టీఆర్ ప్రారంభించారు. అప్పట్లో ఒక్కో ఇంటి వ్యయాన్ని రూ.6 వేలుగా నిర్ణయించారు. అందులో సగం రుణం. తర్వాత నిర్మాణ వ్యయం పెరగడంతో ఇంటి రాయితీతో పాటు లబ్ధిదారులు తీసుకునే రుణం కూడా పెరిగింది. పేదల రుణాలను కఠినంగా వసూలు చేయాలని గత ప్రభుత్వాలేవీ భావించలేదు. మధ్యలో వసూలుచేసే ప్రయత్నాలు జరిగినా, విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు. ఏటా కొంతమంది లబ్ధిదారులు రుణాలు చెల్లిస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం పాత రుణాలన్నింటికీ ఓటీఎస్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. అందరూ తీసుకున్న రుణం, వడ్డీ కలిపి రూ.14 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని లెక్కతేల్చారు. కొత్త పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పురపాలక సంఘాల్లో రూ.15 వేలు, నగరపాలక సంస్థల్లో రూ.20 వేలు వసూలు చేయాలని నిర్ణయించారు. ఇంటిని వేరేవరికైనా అమ్మితే రెట్టింపు వసూలు చేస్తారు. ఇలా రూ.4,500 కోట్ల వరకు వసూలయ్యే అవకాశం ఉంది.
వడ్డీని బూచిగా చూపి...
పక్కా ఇళ్ల ప్రారంభం నాటి నుంచి చూస్తే... లబ్ధిదారులు తీసుకున్న రుణం కంటే, వాటిని చెల్లించకపోవడం వల్ల వడ్డీ భారీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రభుత్వం చెబుతోంది. చెల్లించాల్సిన అప్పు చాలా ఉందని, ఓటీఎస్ పథకం ద్వారా మేలు జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
చేతులు మారిన ఇంటికి ఎవరు కట్టాలి?