రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిదీ అని హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర మంగళవారం వ్యాఖ్యానించారు. అమరావతి ఏ ఒక్క ప్రాంతానికో.. భూములిచ్చిన రైతులకో మాత్రమే సంబంధించినది కాదన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధులకే భారతదేశం సొంతం కాదని, అది దేశ ప్రజలందరిదీ అని గుర్తుచేశారు. అదే విధంగా రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకే అమరావతి పరిమితం కాదని కర్నూలు, విశాఖపట్నం వాసులు సహా రాష్ట్ర ప్రజలందరికీ చెందుతుందన్నారు. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ వాదనలు వినిపిస్తూ.. రాజధాని నిర్మాణం కోసం భూముల్ని త్యాగం చేసిన రైతులకు ప్రత్యేక హక్కులు ఉంటాయని, వారిని ప్రత్యేక తరగతిగా చూడాలన్న నేపథ్యంలో సీజే పైవిధంగా స్పందించారు. సీనియర్ న్యాయవాది స్పష్టత ఇస్తూ.. మూడు రాజధానుల నిర్ణయంతో భూములిచ్చిన రైతుల, వారి భవిష్యత్తు తరాలు నష్టపోతాయన్నారు. హక్కులను రక్షించే క్రమంలో వారి త్యాగాలను ప్రత్యేకంగా చూడాలనేది తన ఉద్దేశం అన్నారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనేకుల రామారావు, మరికొందరు రైతులు దాఖలుచేసిన వ్యాజ్యాలపై సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ రెండోరోజు మంగళవారం వాదనలు వినిపించారు. కొనసాగింపునకు విచారణ బుధవారానికి వాయిదా పడింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
మూడు రాజధానుల నిర్ణయం రాజ్యాంగ వంచన
సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ వాదనలు వినిపిస్తూ.. ‘అధికరణ 3, 4లను అనుసరించి పార్లమెంటు ఏపీ విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఎంపిక చేయాలని నిర్దేశించింది. ఆ ప్రకారం అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడానికి, చట్టం చేయడానికి వీల్లేదు. ఆ నిర్ణయం రాజ్యాంగ వంచన లాంటిదే.
* అమరావతి నిర్మాణంలో భాగస్వాములైన రైతులు, స్థానిక సంస్థల ప్రమేయం లేకుండా బృహత్తర ప్రణాళిక (మాస్టర్ ప్లాన్) మార్చడానికి వీల్లేదు. అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం మౌలిక వసతులు, నిర్మాణాలు నిర్దిష్ట సమయంలో పూర్తిచేయాలి. ఇప్పటివరకు ఆ ప్రక్రియ పూర్తి చేయలేదు. భూ సమీకరణ పథకం ఖరారైన ఏడాదిలోపు అభివృద్ధి చేసిన ప్రాంతంలో రైతులకు ప్లాట్లు ఇవ్వాలి. అమరావతి అభివృద్ధిలో జాప్యం వల్ల భూముల విలువ క్షీణించింది. రాష్ట్రప్రభుత్వం మూడు రాజధానులను తెరపైకి తెచ్చి ఉద్దేశపూర్వకంగా అమరావతిలో భూముల విలువ తగ్గేలా చేసింది.
కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నతస్థాయి కమిటీ వ్యవహరించింది
అమరావతి సహా ఏపీ సమగ్రాభివృద్ధిపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి తగిన సిఫారసులు చేసేందుకు ఏర్పాటుచేసిన మంత్రులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించి కోర్టు ధిక్కరణకు పాల్పడింది. అభ్యంతరాలు సమర్పించేందుకు 2020 జనవరి 20వ తేదీ వరకు సమయాన్ని పొడిగిస్తున్నట్లు అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. అందుకు విరుద్ధంగా ఉన్నతస్థాయి కమిటీ జనవరి 17నే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అందువల్ల ఆ నివేదిక చెల్లుబాటు కాదు. నివేదిక ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు చెల్లవు.
* ఏపీ సీఆర్‌డీఏ చట్టంలో పేర్కొన్న అమరావతి మాస్టర్ ప్లాన్‌ను అమలు చేస్తామని ‘అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథార్టీ (ఏఎంఆర్‌డీఏ) చట్టంలో పేర్కొన్నా అది కంటితుడుపు చర్య మాత్రమే. అథార్టీ మాస్టర్ ప్లాన్ మార్చుకునేందుకు అందులో వీలు కల్పించారు.
* మూడు రాజధానుల విషయంలో ముందుగా తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకోడానికి సీఆర్‌డీఏ రద్దు చట్టం, పాలన వికేంద్రీకరణ చట్టాలను తీసుకొచ్చారు.