అమ్మ చేతుల మీదుగా పెళ్లి చేసుకుందామనే ఆశతో అమెరికా నుంచి వచ్చాడా అబ్బాయి. దిష్టిచుక్క పెట్టుకుని అక్షతలేసి సల్లంగ బతకండి బిడ్డా అంటూ ఆమె నుంచి ఆశీర్వాదాలు పొందాలనుకున్నాడు. అయితే ఇంతలోనే ఆ కన్నతల్లి కరోనా (corona) బారిన పడింది. ఆసుపత్రి నుంచి ఆరోగ్యంగా తిరిగొచ్చిన తర్వాతే వివాహం చేసుకుందామని వాయిదా వేసుకున్న ఆ యువకుడికి.. పెంచి పెద్దచేసిన అమ్మ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని తెలిసి గుండెలవిసేలా రోదించాడు. అంబులెన్స్‌లో తెచ్చిన తల్లి మృతదేహాన్ని(covid dead body) చూసి అచేతనుడయ్యాడు. అంతలోనే అమ్మ లేదని, ఎన్నటికి రాదని మృతదేహం ఎదుటే కాబోయే వధూవరులు ఇద్దరూ దండలు మార్చుకుంటూ శోకంలో మునిగిపోయారు. ఈ దృశ్యం చూసి ఊరివాళ్లంతా అయ్యో ఎంతపనైంది బిడ్డా అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. తెలంగాణలోని సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేటలో బుధవారం చోటు చేసుకుందీ గుండెలను పిండేసే ఈ విషాద ఘటన.
Corona death: అమ్మా.. కళ్లు తెరువు.. అక్షతలేసి ఆశీర్వదించు - కరోనా మృతుల వార్తలు
పెళ్లి చేసుకుని కుటుంబంతో సంతోషంగా ఉందాం అని అమెరికా నుంచి వచ్చిన ఆ యువకుడిని కరోనా వెంటాడింది. పెంచి పెద్ద చేసిన అమ్మ ఆశీర్వాదంతో ఏడడుగులు వేద్దాం అనుకున్న అతడి కోరికను కొవిడ్ నాశనం చేసింది. ముడుముళ్లు వేస్తున్న సమయంలో అమ్మ ముఖంలో ఆనందం చూద్దాం అనుకుంటే.. తల్లి మృతదేహం ముందు దండలు మార్చుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది మహమ్మారి.
ఇస్మాయిల్ ఖాన్‌పేట గ్రామానికి చెందిన పల్పనూరి రేణుక (49) కరోనా గురికావడంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వివాహం చేసుకునేందుకు అమెరికా నుంచి వచ్చిన ఆమె రెండో కుమారుడు రాకేష్.. తల్లికి బాగా లేకపోవడంతో ఈనెల 6న నిశ్చితార్థం, 21న జరగాల్సిన పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ఆమె ఆరోగ్యంగా తిరిగొస్తుందని ఆశగా ఎదురుచూశాడు. అమ్మ కళ్లముందే తాము ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నాడు. కరోనా అమ్మను బలితీసుకోవడంతో ఇక అమ్మను చూడలేనని కన్నీరుమున్నీరయ్యాడు. అమ్మా.. నీ సాక్షిగానే మా పెళ్లి అంటూ ఆవేదనకు గురవుతూ తనకు కాబోయే భార్యతో కలిసి దండలు మార్చుకున్నాడు. పదిరోజుల క్రితం రేణుక అన్న శ్రీశైలం కరోనాతో చికిత్స పొందుతూ మరణించాడు. శుభకార్యంతో కళకళలాడాల్సిన వీరి కుటుంబంలో ఈ ఇద్దరి మరణంతో తీవ్ర విషాదం అలుముకుంది.
ఇవీచూడండి:వీడిన మిస్టరీ... కన్నతల్లే హంతకురాలు