ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Medaram jathara 2022: ఘనంగా ముగిసిన మేడారం మహాజాతర

Medaram jathara 2022: తెలంగాణలో నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన మేడారం మహా జాతర ముగిసింది. చివరి రోజు దేవతల వన ప్రవేశం కోలాహలంగా సాగింది. ఈసారి జాతరలో కోటి 30 లక్షల మంది భక్తజనం అమ్మలను దర్శించుకున్నారు.

Medaram jathara 2022
మేడారం మహాజాతర

By

Published : Feb 20, 2022, 7:21 AM IST

వనం వీడి జనం మధ్యకు వచ్చిన సమ్మక్క, సారలమ్మలు తిరిగి వనప్రవేశం చేయడంతో తెలంగాణలో మేడారం మహాజాతర ముగిసింది. ఆఖరి రోజు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు.. అమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం వరకు దర్శనాలు నిర్విరామంగా కొనసాగాయి. 6 గంటల తర్వాత పూజారులు గద్దెల వద్ద పూజలు నిర్వహించారు. డప్పు, డోలు వాయిద్యాలతో వన ప్రవేశ ఘట్టం ఆద్యంతం కోలాహలంగా సాగింది. విద్యుద్దీపాలు నిలిపేసిన అనంతరం.. వన దేవతలను గద్దెల నుంచి తరలించారు. అమ్మవార్లు వనానికి తరలుతున్న సమయంలో మేడారం పరిసరాలు భక్తుల జయజయధ్వానాలతో మారుమోగాయి. సమ్మక్కను చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి పూజారులు తీసుకెళ్లారు. పగిడిద్ద రాజును మహబూబాబాద్​ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు, గోవిందరాజును ఏటూరు నాగారం మండలం కొండాయికి తీసుకెళ్లడంతో వన ప్రవేశ ఘట్టం ముగిసింది. క్యూలైన్లలో బారులు తీరిన భక్తజనం.. వన ప్రవేశ ఘట్టాన్ని తిలకించి పరవశులయ్యారు.

ఘనంగా ముగిసిన మేడారం మహాజాతర

మహాజాతర విజయవంతం..

గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి జాతరకు నెల రోజుల ముందు నుంచే.. మేడారంలో భక్తుల రద్దీ పెరిగింది. 50 లక్షల మందికిపైగా భక్తులు.. జాతరకు ముందే దర్శనాలు చేసుకున్నారు. వేడుక జరిగిన నాలుగు రోజుల్లోనూ రద్దీ కొనసాగింది. పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవడంతో ఎక్కడా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తలేదు. తాగునీటి విషయంలో.. జనం కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈసారి కోటీ 30 లక్షల మంది భక్తులు తల్లులను దర్శించుకున్నట్లు.. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, ఇంద్రకరణ్​రెడ్డి వెల్లడించారు. ఏ లోపాలు లేకుండా జాతర విజయవంతంగా జరిగిందని తెలిపారు.

ప్రముఖులు దర్శించుకున్నారు.. సీఎం మిస్సయ్యారు..

వన దేవతలను అనేక మంది ప్రముఖులు దర్శించుకున్నారు. నాలుగో రోజు గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. గవర్నర్​ వచ్చినప్పుడు.. మంత్రులు, కలెక్టర్, జిల్లా ఎస్పీ కనిపించకపోవడం.. చర్చనీయాంశంగా మారింది. అశేష భక్తజనంతో కలిసి దేవతలను దర్శించుకోవడం ఎంతో సంతృప్తినిచ్చిందని గవర్నర్​ సంతోషం వ్యక్తం చేశారు. ఈసారి జాతరలో మూడో రోజున ముఖ్యమంత్రి కేసీఆర్​ మేడారం వస్తారని చెప్పినా.. ఆఖరు నిమిషంలో పర్యటన రద్దు చేసుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి సహా పలువురు ప్రముఖులు.. వన దేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మళ్లీ రెండేళ్లకు వనదేవతలు జనం మధ్యకు వచ్చి దర్శనభాగ్యం కల్పించనున్నారు.

ఇదీ చూడండి:Medaram jatara: మేడారం గద్దెలపై కొలువుదీరిన సారలమ్మ

ABOUT THE AUTHOR

...view details