హైదరాబాద్‌లోని ఖానామెట్ భూముల ఈ-వేలం ప్రక్రియ ముగిసింది. మొత్తం 14.91 ఎకరాల భూముల ద్వారా ప్రభుత్వానికి రూ.729.41 కోట్ల ఆదాయం సమకూర్చాయి. వేలంలో ఎకరం సగటు ధర రూ.48.92 కోట్లుగా ఉండగా.. గరిష్ఠంగా రూ.55 కోట్లు పలికింది. లింక్‌వెల్ టెలీ సిస్టమ్స్ సంస్థ గరిష్ఠంగా 3.15 ఎకరాలను రూ.153.09 కోట్లకు దక్కించుకుంది.
భూములను కొనుగోలు చేసిన వారి జాబితా..
విస్తీర్ణం
ఎకరాల్లో
చెల్లించిన మొత్తం
రూ. కోట్లలో
దక్కించుకున్న బిడ్డర్
2.92
రూ.160.60
మంజీరా కన్‌స్ట్రక్షన్స్
3.15
రూ.153.09
లింక్‌వెల్ టెలీ సిస్టమ్స్
2
రూ.92.4
లింక్‌వెల్ టెలీ సిస్టమ్స్
3.69
రూ.185.98
జీవీపీఆర్ ఇంజినీర్స్
3.15
రూ.137.34
అప్‌టౌన్ లైఫ్ ప్రాజెక్ట్స్
కోకాపేటలో ఎకరం రూ.60 కోట్లు
గురువారం నిర్వహించిన కోకాపేట భూములు ఈ-వేలం సైతం రాష్ట్ర ప్రభుత్వానికి కనకవర్షం కురిపించింది. హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన నియోపోలిస్ లే అవుట్‌లోని భూములు రికార్డు ధర పలికాయి. గరిష్ఠంగా ఎకరానికి ఏకంగా రూ.60.20 కోట్లు పలికింది. 1.65 ఎకరాల విస్తీర్ణం ఉన్న భూమిని రాజపుష్ప రియాల్టీ సంస్థ ఎకరం 60.2 కోట్ల చొప్పున 99.33 కోట్లకు దక్కించుకుంది. సగటున ఎకరం రూ.40.05 కోట్ల ధరను కోకాపేట భూములు పలికాయి. మొత్తం 49.949 ఎకరాల అమ్మకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 2,000.37 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది.
కోకాపేటలోని భూములను వేలం వేయడానికి ప్రభుత్వం ఏడాది కిందట నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే 49.92 ఎకరాలను అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వెంచర్‌గా మార్చే పనిని హెచ్‌ఎండీఏ భుజానికెత్తుకుంది. ఈ మొత్తం భూమిని ఎనిమిది ప్లాట్లుగా విభజించింది. ఒక్కో ఎకరం కనీసం ధర రూ.25 కోట్లుగా నిర్ధారించింది. దీనికి అనుగుణంగా ఈ-వేలం నిర్వహించింది. ఈ వెంచర్‌కు నియోపొలిస్ పేరు పెట్టింది. అవుటర్ పక్కనే ఈ వెంచర్ ఉంది.
ప్రస్తుతం ఈ వెంచర్‌లోకి అవుటర్ నుంచి నేరుగా రావడానికి వీలులేదు. ఫైనాన్షియల్ జిల్లా నుంచి కోకాపేటకు రావాలంటే ఇంటర్ ఛేంజ్‌లో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు ప్రత్యేకంగా ట్రంపెట్ నిర్మిస్తున్నారు. దీనివల్ల ఎయిర్‌పోర్టు వైపు నుంచి ఔటర్ మీదుగా నేరుగా నియోపోలిస్ లే అవుట్‌లోకి రావచ్చు. దీనికి రూ.82 కోట్లను వ్యయం చేస్తున్నారు. దీంతో ఈ నియోపోలిస్‌కు పెద్దఎత్తున డిమాండ్ ఏర్పడింది.