వద్దని వారిస్తున్నా వినకుండా వరద దాటడానికి వెళ్లి.. కొట్టుకుపోయిన వ్యక్తి మళ్లీ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం నూరుళ్లాపూర్ వద్ద జరిగింది. మెదక్ జిల్లా సదాశివపేట మండలం సిద్దపూర్‌కు చెందిన రాజేశ్... బస్సులో తాండూరుకు వెళ్తున్నాడు. మార్పల్లి మండలం పరిధిలో భారీగా వర్షాలు పడడం వల్ల బంట్వారం మండలం నూరూళ్లాపూర్ వద్ద వాగు పొంగిపొర్లుతోంది. వాగును చూసిన డ్రైవర్ బస్సును ఒడ్డునే నిలిపివేశాడు. ప్రయాణికులందరూ వరద ఉద్ధృతిని చూసి భయపడుతుంటే.. రాజేశ్ మాత్రం వాగును దాటడానికి సిద్ధమైపోయాడు.
నీటి ప్రవాహాన్ని చీల్చుకుంటూ వాగులోకి...
వరదలోకి దిగిన రాజేష్‌ను గమనించిన ప్రయాణికులు, గ్రామస్థులు వద్దని హెచ్చరించారు. అటువైపు ఉన్న వారే కాకుండా... ఇటువైపు ఉన్న వారు కూడా అరిచిగీపెట్టారు. ఎంత వారించినా వినకుండా... రాజేశ్ మాత్రం వరదలోకి దిగాడు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాడు. మరోవైపు రాజేశ్ సాహసాన్ని ఒడ్డుపై ఉన్న వాళ్లు చరవాణుల్లో బంధిస్తున్నారు. ఇంకోవైపు.."అతడు ఒడ్డుకు క్షేమంగా చేరుకుంటాడా..? ప్రవాహానికి తట్టుకోలేక కొట్టుకుపోతాడా...?" అంటూ అంచనాలు వేయటం మొదలుపెట్టారు. ఇంకొందరైతే... అప్పటికీ కూడా వెనక్కి తిరిగి వెళ్లిపొమ్మని.. అరవటమే కాదు... తిట్టటమూ ప్రారంభించారు.
అందరూ చూస్తుండగానే...
ఇదిలా ఉండగా... నీటి వేగాన్ని చీల్చుకుంటూ.. అడుగులో అడుగు వేసుకుంటూ.. రాజేశ్ ముందుకు సాగుతున్నాడు. అందరి కళ్లూ అతని మీదే. ముందుకు వచ్చేకొద్ది వరద వేగం పెరుగుతోంది. రాజేశ్ నడక నెమ్మదించింది. వెనక నుంచి.. "కాళ్లు పైకి లేపొద్దు.. అక్కడ తెప్ప గట్టిగా వస్తోంది. ప్రవాహానికి ఎదురుగా రా.." అంటూ సలహాలు, అరుపులు వినిపిస్తున్నాయి. అంతలోనే.. రాజేశ్ అడుగు ముందుకు వేయటం... నీటి తెప్ప వేగంగా రావటం.. కింద పడటం.. కొట్టుకుపోవటం... అంతా ఒక్కసారిగా కళ్ల ముందు జరిగిపోయింది. "చెప్పితే విన్నాడా..? ఇప్పుడు కొట్టుకుపోవట్టే..!" అంటూ కొందరు నిట్టూరుస్తూంటే... "వాడికి ఈత వస్తే మాత్రం బతికే అవకాశముంది... రాకపోతే మాత్రం అంతే సంగతులు" అంటూ... రాజేశ్‌పై మళ్లీ అంచనాలు వేయటం మొదలుపెట్టారు.
పొలాల్లో ఉన్న రైతుల సాహసంతో..
"భూమి మీద నూకలు బాకీ ఉంటే... ఎంత పెద్ద ప్రమాదమొచ్చినా బతుకుతారు" అన్న నానుడి ఎంత వరకు సత్యమో కాని... రాజేశ్ విషయంలో మాత్రం నిజమైంది. వరద ప్రవాహాన్ని పొలాల్లో ఉన్న కొంత మంది రైతులు గమనిస్తుండగా.. రాజేశ్ కొట్టుకురావటం గమనించారు. వెంటనే అప్రమత్తమై... రాజేశ్‌ను వాగు నుంచి బయటకు తీసుకొచ్చారు. పొలాల్లో ఉన్న రైతుల సాహసంతో రాజేశ్ ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డాడు.
వర్షం పడకపోయిన వాగులు..
తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పరిగి, పుడూరు మండలాల్లో కురిసిన భారీ వర్షానికి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని దేవరపల్లి ఈసీ వాగు పొంగిపొర్లుతోంది. వరద నీళ్లు హిమత్సాగర్లోకి వెళ్తున్నాయి. చేవెళ్ల మండలంలోని గ్రామాల్లో వర్షం కురవకపోయినా.. పైన కురుస్తున్న జోరు వానలకు వాగులు మాత్రం ఉద్ధృతంగా పారుతున్నాయి.