rowdy sheets: ఏపీ పోలీసు స్టాండింగ్ ఆర్డర్స్ (పీఎస్‌వో) ఆధారంగా రౌడీషీట్ తెరవడం, వాటిని కొనసాగించడం, వ్యక్తులపై నిఘా ఉంచడం చెల్లదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును హైకోర్టు ధర్మాసనం నిలిపేసింది. ఆ తీర్పు ఆధారంగా ఇప్పటికే సంబంధిత వ్యక్తులపై మూసివేసిన రౌడీషీట్/హిస్టరీషీట్/సస్పెక్ట్ షీట్‌లను తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు తెరవడానికి వీల్లేదని స్పష్టంచేసింది. తాజాగా తగిన ఆధారాలుంటే మాత్రం వారిపై ఆయా షీట్లు తెరిచే స్వేచ్ఛను పోలీసులకు ఇచ్చింది. పీఎస్‌వో నిబంధనల మేరకు అనుమానితులు, నిందితులపై పోలీసులు నిఘా పెట్టొచ్చని తెలిపింది. అయితే ముందుగా నోటీసు ఇచ్చాకే ఏ వ్యక్తినైనా, నిందితుడినైనా ఠాణాకు పిలవాలని తేల్చిచెప్పింది.
అరెస్ట్ విషయంలో కోర్టు ఉత్తర్వులు అమలు చేసేందుకు, ఏదైనా కేసులో నిందితుడు/అనుమానితుడు తప్పించుకుపోతాడనే ఆందోళన ఉన్న సందర్భంలో తప్ప... రాత్రి వేళల్లో పోలీసులు నిందితుల ఇళ్లకు వెళ్లడానికి వీల్లేదంది. వేలిముద్రల సేకరణ విషయంలో చట్ట నిబంధనలు, సింగిల్ జడ్జి పేర్కొన్న విధంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ బి.శ్యాంసుందర్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
57 వ్యాజ్యాలపై విచారణ
రౌడీషీట్లు నమోదు చేయడం, వాటిని కొనసాగించడాన్ని సవాలు చేస్తూ సుమారు 57 వ్యాజ్యాలు హైకోర్టులో దాఖలయ్యాయి. వాటిపై లోతైన విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. పోలీసు స్టాండింగ్ ఆర్డర్స్‌కు చట్టబద్ధతే లేదని, వాటి ఆధారంగా రౌడీషీటు తెరవడం, నిఘా పెట్టడం, ఠాణాల్లో ఫోటోల ప్రదర్శన సరికాదని తేల్చారు. ఆ చర్యలు గోప్యత హక్కును హరించడమేనని పేర్కొన్నారు. నిఘా, రౌడీషీటు తెరిచేందుకు వీలు కల్పిస్తున్న స్టాండింగ్ ఆర్డర్స్ చెల్లుబాటుకావని తేల్చిచెప్పారు. వ్యక్తుల సమాచారం సేకరించొద్దని ఆదేశించారు. పిటిషనర్లపై రౌడీషీట్లను తక్షణం మూసేయాలని ఈ ఏడాది జులై 15న తీర్పు చెప్పారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి ధర్మాసనం ముందు అప్పీల్ వేశారు. దానిపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం.. సోమవారం నిర్ణయాన్ని వెల్లడించింది.