HIGH COURT: అమరావతి రైతులకు హైకోర్టులో ఊరట - hearing in high court about amaravathi farmers lands
13:03 September 13
అమరావతిలో ప్లాట్ల రద్దు జీవోపై ‘యథాతథ స్థితి’
రాజధాని అమరావతికి భూములిచ్చిన కేటగిరీ 4 కిందకు వచ్చే అసైన్డ్ రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. వీరికి కేటాయించిన నివాస, వాణిజ్య ప్లాట్లను రద్దు చేసేందుకు వీలు కల్పిస్తున్న జీవో 316 విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ సోమవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. జీవో 316 ఆధారంగా ప్లాట్లను రద్దు చేసే విషయంలో తొందరపాటు చర్యలొద్దని స్పష్టం చేశారు. రాజధానికి భూములిచ్చిన అసైన్డ్ రైతులకు కేటాయించిన ప్లాట్లను రద్దు చేసేందుకు వీలు కల్పిస్తూ.. ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 316ను సవాలు చేస్తూ మందడం గ్రామానికి చెందిన రామాంజనేయరాజు హైకోర్టులో వ్యాజ్యం వేశారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపిస్తూ.. ‘రాజధాని నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం భూసమీకరణ విధానాన్ని అనుసరించింది. అసైన్డ్ రైతుల్ని ఆరు కేటగిరీలుగా విభజించి ప్యాకేజీలు ప్రకటించింది. అందుకోసం 2016 ఫిబ్రవరి 17న జీవో 41ని తీసుకొచ్చింది. భూసమీకరణ విధానం ప్రకటించడానికి చాలా రోజుల కిందట అసైన్డ్ రైతుల నుంచి భూములు కొనుక్కుని సాగు చేసుకుంటున్న వారిని ఆ జీవోలో కేటగిరీ(4)గా పేర్కొంది. ఎప్పటి నుంచో భూములు సాగు చేసుకుంటున్నందున నష్టపోకుండా ఉండాలని వారిని శివాయ్‌జమేదార్స్‌గా పరిగణించింది. ఎకరానికి 500 చ.గజాల నివాస స్థలం, 50 చ.గజాల వాణిజ్య స్థలం కేటాయించింది. అసైన్డ్ భూములను వెనక్కిచ్చినట్లుగా భావించిన అప్పటి ప్రభుత్వం ప్లాట్లు ఇచ్చింది. వాటిని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదు. అయినా.. నివాస, వాణిజ్య స్థలాల్ని రద్దు చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం 2019 డిసెంబర్ 18న జీవో 316ను తీసుకొచ్చింది. చట్టబద్ధంగా కేటాయించిన ప్లాట్‌ను ఓ అసైన్డ్ రైతు నుంచి పిటిషనర్ రామాంజనేయరాజు కొన్నారు. జీవో 316 కారణంగా.. నోటీసులు ఇవ్వకుండానే ప్లాట్‌ను రద్దు చేసే ప్రమాదం ఉంది. సీఆర్‌డీఏ, భూసమీకరణ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ జీవో అమలును నిలిపివేయండి…’ అని కోరారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. జీవోపై స్టేటస్ కో ఉత్తర్వులిచ్చారు.
ఇదీచదవండి.