Farmers on capital lands:రాజధాని కోసం భూములిచ్చిన తమకు భూసమీకరణ పథకం ప్రకారం అభివృద్ధి చేసిన ప్లాట్లను సకాలంలో ఇవ్వని కారణంగా పరిహారం ఇప్పించాలని కోరుతూ రైతు గరికపాటి అప్పారావు, యుగంధర్ తో పాటు మరికొందరు 2020 జనవరిలో హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. ఈ వ్యాజ్యాలు హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చాయి. రాజధాని అమరావతికి కేటాయించిన భూముల్లో ఇళ్ల స్థలాల వ్యవహారంపై హైకోర్టులో విచారణ ఆగస్టు 29 కి వాయిదా పడింది. ప్రభుత్వం వేసిన అదనపు అఫిడవిట్ తిరుగుసమాధానంగా వేయాలని పిటిషనర్లకు సూచించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది.
రాజధాని అమరావతి కోసం రైతులిచ్చిన భూముల్లో సీఆర్డీఏ చట్ట నిబంధనలకు విరుద్ధంగా నవరత్నాలు-పేదలందరికి ఇళ్లు పథకం కింద స్థలాలు కేటాయించేందుకు వీలుగా 2020 ఫిబ్రవరి 25 న రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాజ్యాలపై విచారించి జీవో నెంబర్ 107 అమలును నిలుపుదల చేసింది. రాజధాని ప్రాంతంలో రైతులిచ్చిన భూముల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం జోనల్ రెగ్యులేషన్ విధానానికి, సీఆర్డీఏ బృహత్తర ప్రణాళిక నిబంధనలకు విరుద్దమంది. ఈ వ్యాజ్యాలపై విచారణ జరపాలని ఇటీవల ఏజీ ఎస్ . శ్రీరామ్ అభ్యర్థన చేశారు . దీంతో ఈ వ్యాజ్యాలు తాజాగా విచారణకు వచ్చాయి.
రాజధాని అమరావతి కోసం జీవనాధారమైన వ్యవసాయ భూములను.... ప్రభుత్వానికి , సీఆర్డీఏకు రైతులు అప్పగించారని, చట్ట నిబంధనల ప్రకారం అభివృద్ధి చేసిన ప్లాట్లు తిరిగి ఇవ్వకపోవడంతో బతుకు భారంగా మారిందని పిటిషనర్ల తరపు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు హైకోర్టుకు నివేదించారు. భూసమీకరణ విధానం నోటిఫై అయి మూడేళ్లలోపు అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పటి వరకు రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాలను పూర్తిచేయలేదని, అభివృద్ధి చేసిన ప్లాట్లను తిరిగి అప్పగించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ నేపథ్యంలో మూడేళ్ల గడువు మించిన దగ్గర నుంచి... నెలకు ' నివాస ప్లాట్ సదరపు గజానికి 30, వాణిజ్య ప్లాటు 50 రూపాయల చొప్పున పరిహారం చెల్లించేలా ఆదేశించాలని కోరారు .
సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 58 ప్రకారం.. భూసమీకరణ పథకాన్ని అమలు చేసుకునే గడువును పెంచుకునే వెసులుబాటు ఉందని.... సీఆర్డీఏ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ మేరకు ఇప్పటికే తీర్మానం చేసి గడువును పొడిగించామన్నారు. సింగిల్ జడ్జి వద్ద ఓ వ్యాజ్యంలో పూర్తి వివరాలతో కౌంటర్ వేశామన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం..... ప్రస్తుత వ్యాజ్యాలకు సింగిల్ జడ్జి వద్ద వేసిన కౌంటర్ ను అన్వయిస్తున్నట్లు మెమో దాఖలు చేయాలని సీఆర్డీఏను ఆదేశించింది. సీఆర్డీఏ కౌంటర్ పై తిరుగు సమాధానంగా వేయాలని పిటిషనర్లకు సూచిస్తూ.... విచారణను ఆగస్టు 29 కి వాయిదా వేసింది.