ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని విజయవాడ పోలీసుల కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. విచారణను ఈ నెల 18కి వాయిదా వేస్తూ..హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ డి.రమేశ్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది.
తన కుమారుడు జాన్సన్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను విజయవాడ ఒకటో పట్టణ ఠాణా పోలీసులు ఈ నెల7న అక్రమంగా తీసుకెళ్లారని భవాని అనే మహిళ హైకోర్టులో పిటిషన్ వేశారు. న్యాయవాధి పీవీఎన్ కిరణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ..జాన్సన్‌పై క్రిమినల్ కేసు లేదని...అయినా పోలీసులు ఎందుకు తీసుకెళ్లారో తెలుసుకునేందుకు ఠాణాకు వెళ్లగా అనుమతించలేదన్నారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ..ఫిబ్రవరిలో నమోదైన చోరీ కేసులో వారిని పోలీసులు ఈ నెల 9న సాయంత్రం 6 గంటలకు అరెస్ట్ చేశారని, 24 గంటల్లోగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఈ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం దీనిపై విచారణ జరిపి అఫిడవిట్ వేయాలని పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. ఎఫ్ఐఆర్ ఏ తేదీన, ఎన్ని గంటలకు అందిందో పూర్తి వివరాలు నివేదించాలని విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్(సీఎంఎం)కు కోర్టు సూచించింది.