అమరావతి ప్రాంతంలోని భవనాల నిర్మాణ పనుల్ని కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని, జీఎన్ రావు కమిటీ నివేదిక అమలు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి హైకోర్టులో అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. జీఎన్ రావు కమిటీ ఏర్పాటుకు చట్టబద్ధత లేదని... మూడు రాజధానులంటూ కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలు నిబంధనలకు లోబడి లేవన్నారు. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం అంగీకరిస్తే కమిటీ ఏర్పాటును సవాలు చేస్తూ తాను దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం నిరుపయోగం అవుతుందని వివరించారు. ఈ నెల 27న జరగనున్న మంత్రివర్గ భేటీలో కమిటీ సిఫారసులను ప్రభుత్వం అంగీకరిస్తే రాజధానికి భూములిచ్చిన రైతులకు నష్టం కలుగుతుందని పిటిషన్లో కార్యదర్శి పేర్కొన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని రాజధానిలో నిర్మాణపనుల్ని కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏను ఆదేశించాలని కోర్టును కోరారు.
రాజధాని పనులపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ - ఏపీలో రాజధాని వివాదం
అమరావతిలో భవన నిర్మాణ పనులు కొనసాగించాలంటూ రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. రాజధాని పనులు కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. అయితే అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరించింది.
జీఎన్ రావు సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి సంబంధించిన జీవో 585ను రద్దు చేయాలని కొన్నిరోజుల క్రితం రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల దానిపై విచారణ జరిపిన ధర్మాసనం... ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ విచారణను ఫిబ్రవరి 3కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇవాళ కోర్టు ప్రారంభం కాగానే అనుబంధ పిటిషన్లపై అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విన్నవించారు. దీనికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. వచ్చే సోమవారం విచారణ జరుపుతామని పేర్కొంది.