ఆంధ్రప్రదేశ్

andhra pradesh

high court: 'ఆగస్టు 5లోగా కౌంటర్ వేయండి'

By

Published : Jul 30, 2021, 4:31 AM IST

Updated : Jul 30, 2021, 4:41 AM IST

రాజధాని భూములకు సంబంధించి అనిశా తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. దీనిపై ఆగస్టు 5లోపు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆగస్టు 12న తుది విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.

high court
హైకోర్టు

రాజధాని భూములకు సంబంధించి గతేడాది సెప్టెంబర్ 15న అనిశా తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. దీనిపై ఆగస్టు 5లోపు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్​కు ఆగస్టు 12 లోపు తిరుగు సమాధానం ఇవ్వడానికి పిటిషనర్​కు వెసులుబాటు ఇచ్చింది. 12వ తేదీన తుది విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన సమయంలో ఈ వ్యాజ్యంపై విచారణను పూర్తి చేస్తామని వెల్లడించింది. ఫిర్యాదిదారు కోమట్ల శ్రీనివాస స్వామిరెడ్డిని ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చాలంటూ పిటిషనర్ దమ్మాలపాటి శ్రీనివాస్ దాఖలు చేసిన అనుబధం పిటిషన్​నూ అనుమతించింది. శ్రీనివాస స్వామిరెడ్డికి నోటీసులు జారీచేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు.

ఇదీ నేపథ్యం..

రాజధాని భూముల కొనుగోలు విషయంలో గతేడాది సెప్టెంబర్ 15న అనిశా పలువురిపై కేసు నమోదు చేసింది. దర్యాప్తు సంస్థలు తన విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోకుండా నిలువరించాలని , తనపై అనిశా నమోదు చేసిన కేసును రద్దు చేయాలని మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు. ఆ వ్యాజ్యంపై అప్పుడే విచారణ జరిపిన న్యాయమూర్తి .. అనిశా నమోదు చేసిన కేసులో తొందరపాటు చర్యలొద్దని ఆదేశాలు జారీచేశారు. ఈ కేసులో ఉన్న వారిపై విచారణ, దర్యాప్తును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఎఫ్ఐఆర్​లో వివరాలు ప్రచురణ, ప్రసారానికి వీల్లేదని గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు. ఈ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వ్యాజ్యం(ఎస్సెల్ఫీ) వేసింది. ఈ ఏడాది జులై 22న సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో ఎస్సెల్ఫీని ఉపసంహరించుకోవడానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. హైకోర్టులో కౌంటర్ వేస్తామని తెలిపింది. ఎస్సెల్పీ ఉపసంహరణకు అనుమతినిచ్చిన సుప్రీంకోర్టు... నాలుగు వారాల్లో విచారణను పూర్తి చేయాలని హైకోర్టుకు స్పష్టం చేసింది . ఈ నేపథ్యంలో గురువారం ఈ వ్యాజ్యం హైకోర్టులో విచారణకు వచ్చింది.

మరో వ్యాజ్యంలో...

అనిశా నమోదు చేసిన ఇదే ఎఫ్ఐఆర్​లో తనను పదమూడో నిందితురాలిగా పేర్కొనడాన్ని సవాలు చేస్తూ వెల్లంకి రేణుకాదేవి దాఖలు చేసిన వ్యాజ్యం కూడా హైకోర్టులో గురువారం విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.ప్రణతి వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఆదేశాల మేరకు ఫిర్యాదిదారుకు నోటీసు చేరిందన్నారు . వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి .. నోటీసు అందినా విచారణకు ఎవరూ హాజరుకాలేదని నమోదు చేశారు. విచారణను ఆగస్టు 12కు వాయిదా వేశారు.

ఇదీ చదవండి

హెచ్​ఆర్​సీ కార్యాలయం ఏర్పాటు పై హైకోర్టులో విచారణ

Last Updated : Jul 30, 2021, 4:41 AM IST

ABOUT THE AUTHOR

...view details