చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో అధికారపార్టీ మద్దతుదారులు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నా..... నిలువరించడంలో ఎస్ఈసీ , జిల్లా కలెక్టర్ విఫలమయ్యారంటూ ఆ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం నాయకురాలు అనీషారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోనూ అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని... మాజీ ఎమ్మెల్యే శంకర్ కోర్టును ఆశ్రయించారు. గుంటూరు జిల్లా మాచర్ల పరిధిలోని గ్రామాల్లోనూ బలవంతపు ఏకగ్రీవాలపై మరికొన్ని పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటన్నింటినీ హైకోర్టు విచారించింది. సీనియర్ న్యాయవాది పి. వీరారెడ్డి పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారని... పలుచోట్ల నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. అతికష్టం మీద నామినేషన్ వేసినా..... తర్వాత ఏదో కారణంతో వాటిని తిరస్కరిస్తున్నారని న్యాయస్థానానికి విన్నవించారు. తిరస్కరణకు గురైనట్లు ఉత్తర్వులివ్వాలని కోరినా... ఇవ్వడం లేదన్నారు. ఈ వ్యవహారంపై ఎస్ఈసీ కి ఫిర్యాదులు అందినా ఫలితం లేదని వాదించారు. ఎన్నికల సమయంలో యంత్రాంగం అంతా ఎస్ఈసీ పర్యవేక్షణలో ఉన్నా..... చర్యలు లేవన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత ఎస్ఈసీ పై ఉందన్నారు. కేవలం నోటిఫికేషన్ ఇచ్చి …. బాధ్యత తీరిపోయిందనుకుంటే కుదరదన్నారు. ప్రకటన ఇచ్చిన నాటి నుంచి ఫలితాల వెల్లడి వరకు ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలన్నారు. 5 మండలాల్లో... 85 పంచాయతీల్లో ఎనభై రెండింటిని ఏకగ్రీవం చేసుకుంటున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ అంశాలను పరిశీలించి తగిన ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు.
ఎస్ఈసీ తరపున వాదించిన న్యాయవాది అందిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ , ఎస్పీలకు పంపి చర్యలకు ఆదేశిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రెండు కేసులు నమోదయ్యాయని కోర్టు దృష్టికి తెచ్చారు. అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమైనట్టు ఫిర్యాదు చేస్తే తగిన విధంగా స్పందిస్తామన్నారు. అనంతరం జోక్యం చేసుకున్న ప్రభుత్వ న్యాయవాది వ్యాజ్యానికి విచారణార్హత లేదని వాదించారు. నామినేషన్లు వేయడానికి ఇబ్బందులు ఎదుర్కొన్న వారు కోర్టుకు రావాలే తప్ప వారందరి తరఫున పిటిషనర్ వ్యాజ్యం దాఖలు చేయడానికి వీల్లేదన్నారు.