గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోందని హైకోర్టు (high court) పేర్కొంది. కొవిడ్ ఆంక్షలను సక్రమంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. కరోనాను ప్రజలు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని , మాస్కులు ధరించడం లేదని అమికస్ క్యూరీ వైవీ రవిప్రసాద్ వాదనలు వినిపించారు. కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ప్రభుత్వం జీవోలు ఇస్తున్నా .. క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్నారు. మూడో దశ వ్యాప్తి ముప్పు పొంచి ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారన్నారు.
మాస్కులు ధరించని వారికి రూ.వెయ్యి జరిమానా వేస్తున్నామన్నారని ప్రభుత్వ న్యాయవాది సుమన్ వాదనలు వినిపించారు. ఇరువైపు న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ చర్యల పురోగతిని పరిశీలించేందకు విచారణను ఈ నెల 22 కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. కొవిడ్ కట్టడిపై చర్యలను హైకోర్టు పర్యవేక్షిస్తూ విచారణ జరుపుతుంది.