తెలంగాణ తిరుపతి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో సహజ సిద్ధమైన కొండ ప్రాంగణాలతో పాటు పచ్చదనంతో కూడిన పల్లెటూరి వాతావరణం నెలకొల్పేలా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మన సంస్కృతిని చాటే కలశ రూపం అదనపు ఆకర్షణగా మారింది. కొండపై ప్రాంగణాన్ని ఆధ్యాత్మికంగా రూపొందిస్తున్నారు. కొండకింద ఆలయ పరిసరాలను గ్రామీణ వాతావరణం ప్రస్ఫుటమయ్యేలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పలుసార్లు దిశానిర్దేశం చేశారు.
హరితమయం
సీఎం ఆదేశాలతో కొండకింద ఉత్తరదిశలోని ప్రెసిడెన్షియల్ సూట్ల వద్ద వలయదారి ప్రాంగణంలో ఈత, కొబ్బరి, పొన్న, నాగవళి చెట్ల పోషణకు 15 రోజుల క్రితం శ్రీకారం చుట్టారు. ఆధ్యాత్మికత, ఆహ్లాదాన్ని కలిగించే తరహాలో హరితమయంగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేపట్టారు. క్షేత్ర సందర్శనకు వచ్చే వీవీఐపీలు బస చేసే ప్రెసిడెన్షియల్ సూట్ల వద్ద ఎక్కడా లేని విధంగా మొక్కలను పూజలో వినియోగించే "కలశం" ఆకారంలో ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు.
సంస్కృతి ఉట్టిపడేలా..
గిరి ప్రదక్షిణ దారిలోనూ ఏపీ నుంచి తెప్పించిన వివిధ మొక్కలను పెంచుతున్నారు. ముఖ్యమంత్రి సూచనలతో చేపట్టిన ఈ పనుల తీరుపై సీఎంవో భూపాల్ రెడ్డి ఎప్పటికపుడు సమాచారం సేకరిస్తున్నారు. ఈ క్షేత్ర సందర్శన కోసం వచ్చే దేశ, విదేశీయులకు ఆధ్యాత్మిక ఆహ్లాదంతో సహా మన సంస్కృతిని చాటేలా కొండకింద గండి చెరువు పరిసరాలు, వలయదారి, గిరి ప్రదక్షిణ దారులు పచ్చగా మార్చేందుకు కసరత్తులు ముమ్మరమయ్యాయి.
సీఎం ప్రత్యేక దృష్టి