ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డీఏ బకాయిలు తీసుకోవడం క్రిమినల్‌ చర్యే

Employees DA: ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల్లో జమ చేసిన డీఏ బకాయిలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం వారిలో ఆందోళనకు దారి తీసింది. తమ ఖాతాల్లోని సొమ్మును ఎలా తీసుకుంటారంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఛైర్మన్‌ సూర్యనారాయణ ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడారు.మరోవైపు సచివాలయంలో ఆర్థిక శాఖ అధికారులతో ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు, ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

Employees DA
Employees DA

By

Published : Jun 30, 2022, 4:18 AM IST

Employees DA: ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల్లో జమ చేసిన డీఏ బకాయిలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం వారిలో ఆందోళనకు దారి తీసింది. తమ ఖాతాల్లోని సొమ్మును ఎలా తీసుకుంటారంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఛైర్మన్‌ సూర్యనారాయణ ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడారు. అధికారుల సమాధానం సంతృప్తిగా లేదని, ఉద్యోగుల అనుమతి లేకుండా ఖాతా నుంచి నిధులు తీసేసుకున్నారని వెల్లడించారు. దీన్ని క్రిమినల్‌ చర్యగా భావిస్తున్నామని, ఫిర్యాదు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు సచివాలయంలో ఆర్థిక శాఖ అధికారులతో ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు, ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

పాత పింఛన్‌ (ఓపీఎస్‌), కాంట్రిబ్యూటరీ పింఛన్‌ పథకం (సీపీఎస్‌) వారికి చెల్లించాల్సిన బకాయిలను కలిపి వేయడం వల్ల సమస్య తలెత్తినట్లు ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారని వారు తెలిపారు. జులై నెలాఖరుకు ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

రూ.800 కోట్లు మాయం..

'నిధుల మళ్లింపుపై అధికారుల వివరణ ఏ మాత్రం సంతృప్తికరంగా లేదు. ఉద్యోగుల అనుమతి లేకుండా జీపీఎఫ్‌ ఖాతా నుంచి నిధులు తీసేసుకున్నారు. సుమారు రూ.800 కోట్లు మాయమయ్యాయి. ఇది ఉద్యోగుల ఖాతాలను హ్యాక్‌ చేయడమే. దీన్ని క్రిమినల్‌ చర్యగా భావిస్తున్నట్లు అధికారులకు స్పష్టం చేశాం. దీనిపై ఫిర్యాదు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం. సీఎఫ్‌ఎంఎస్‌ చేసిన పని రాజ్యాంగ విరుద్ధమని భావిస్తున్నాం. దానికున్న చట్టబద్ధత ఏమిటని ప్రశ్నిస్తున్నాం. సీఎఫ్‌ఎంఎస్‌లో ఉండి ఇలాంటి తప్పిదాలకు పాల్పడుతున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? దీని వెనుక లోపాయికారీగా ఏమైనా జరుగుతోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇలా వ్యవహరిస్తే వ్యవస్థపై ఉద్యోగి నమ్మకాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది.'- కె.సూర్యనారాయణ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఛైర్మన్‌

చరిత్రలో జరగని ఘటన ఇది..

'ఉద్యోగుల చరిత్రలో ఇప్పటివరకు ఇలాంటి సంఘటన జరగలేదు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఉదయం నుంచి రెండుసార్లు ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి తరఫున ఆర్థికశాఖ అధికారులతో చర్చించాం. రాష్ట్రంలో ఉద్యోగులకు 2018 జులై నుంచి రావాల్సిన డీఏ బకాయిలు ప్రభుత్వం వేసిందా, వేయలేదా అని ప్రశ్నించాం. ఓపీఎస్‌, సీపీఎస్‌ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల్ని కలిపి వేయడం వల్ల సమస్య తలెత్తిందని ప్రాథమికంగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమైన నివేదికలు రాత్రి 8 గంటలకు అందుతాయని చెప్పారు. ఏ ఒక్క ఉద్యోగికి అన్యాయం జరిగినా తీవ్ర పరిణామాలుంటాయని స్పష్టం చేశాం. ఎవరికీ ఏ ఇబ్బంది కలగదని హామీ ఇచ్చారు. ఎవరికైనా సక్రమంగా పడకపోయినా సరిదిద్దే బాధ్యత తీసుకుంటామన్నారు. డీఏ బకాయిలను జులై నెలాఖరుకల్లా ఓపీఎస్‌ ఉద్యోగులకు జీపీఎఫ్‌ ఖాతాల్లో వేస్తామని, సీపీఎస్‌ ఉద్యోగులకు నగదుగా ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం దీన్ని సీరియస్‌గా తీసుకుని దిద్దుబాటు చర్యలు చేపడుతుందని భావిస్తున్నాం.'- బండి శ్రీనివాసరావు, ఏపీ ఐకాస అధ్యక్షుడు

ఉద్దేశపూర్వకంగా చేసింది కాదన్నారు..

'జీపీఎఫ్‌ ఖాతాల్లో నుంచి నిధుల మళ్లింపు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని ఆర్థిక శాఖాధికారులు చెప్పారు. డీఏ బకాయిలు ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి క్రెడిట్‌, డెబిట్‌ అనే సమస్యే ఉత్పన్నం కాదన్నారు. సీఎఫ్‌ఎంఎస్‌లో సాంకేతిక సమస్యను గత సంవత్సరం పరిష్కరించనందునే ఈసారి మళ్లీ తలెత్తిందన్నారు. రాష్ట్రంలోని 68 వేల మంది ఉద్యోగుల ఖాతాల్లో నుంచి మాత్రమే నిధులు ఉపసంహరణ అయినట్లు ఏజీ కార్యాలయం తెలిపింది. డీఏ బకాయిలు విడతల వారీగా ఇవ్వడం వల్లే ఇలా జరిగింది. సీపీఎస్‌, ఓపీఎస్‌ ఉద్యోగుల బిల్లులు ఒకేసారి కలిపి వేయడం వల్ల కూడా గందరగోళం నెలకొందని అధికారులు చెప్పారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరాం. డీఏ బకాయిలు ఎంతమందికి జమయ్యాయి, ఇంకెంతమందికి జమ కావాల్సి ఉందో వివరాలు రెండు రోజుల్లో వెల్లడిస్తామని తెలిపారు. ఖాతాల్లో నుంచి ఎంత మొత్తం మళ్లిందనేది ఆర్థికశాఖ అధికారులకే స్పష్టత లేదు. కొంతమంది అనవసరంగా ఉద్యోగుల్ని భయాందోళనలకు గురిచేస్తున్నారు.'- బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఐకాస అమరావతి అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details