పట్టణాలు, నగరాల్లోని ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూములు, అపార్టుమెంట్ల భూముల మార్కెట్ విలువలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఆయా ప్రాంతాల డిమాండ్లను అనుసరించి కనీసం 5 నుంచి 50 శాతంపైగా పెరిగే అవకాశాలున్నాయి. ధరలు ఎంతవరకు పెంచాలనే అంశంపై ఇంకా మార్గదర్శకాలు వెలువడలేదు. ఆయా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని డిమాండ్‌ను అనుసరించి సవరిస్తారని భావిస్తున్నారు. ప్రభుత్వం దీనిపై స్పష్టమైన ఆదేశాలివ్వకపోతే స్థానిక సబ్‌రిజిస్ట్రార్లు ప్రతిపాదించిన ధరలే అమల్లోకి రావచ్చు.
భూముల మార్కెట్ విలువను సవరించేందుకు అప్పటివరకు వచ్చిన రెవెన్యూ, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్, ఆయా ప్రాంతాల అభివృద్ధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. సాధారణంగా భూముల మార్కెట్ విలువ పెంపు ప్రతిపాదనలను రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్‌లో ఉంచి ప్రజల నుంచి అభిప్రాయలు సేకరించాకే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఒకటో తేదీ నుంచే మార్కెట్ విలువ పెంచాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందో ప్రశ్నార్థకంగా ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల స్థిరాస్తి రంగం దెబ్బతింది. ఏప్రిల్, మే నెలల్లో రిజిస్ట్రేషన్లు బాగా తగ్గాయి. అయినా మార్కెట్ విలువ పెంపు దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తోంది.