ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 9, 2020, 9:54 AM IST

ETV Bharat / city

నాణ్యమైన చదువు...సామాజిక సేవ

ఇంజినీరింగ్‌లో నాణ్యతను, అదే సమయంలో విద్యార్థులకు సామాజిక సేవను అలవర్చడానికి ప్రభుత్వం కసరత్తు చేసింది. అందులో భాగంగా బీటెక్‌లో 10 నెలల ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసింది. వీరంతా వేసవి సెలవుల్లో కమ్యూనిటీ సర్వీసు చేయాల్సి ఉంటుంది. 75% హాజరు ఉంటేనే పరీక్షలకు అనుమతినిస్తారు.

The government has worked hard to improve the quality of engineering
బీటెక్‌లో 10 నెలల ఇంటర్న్‌షిప్

ఇంజినీరింగ్‌లో నాణ్యతను, అదే సమయంలో విద్యార్థులకు సామాజిక సేవను అలవర్చడానికి ప్రభుత్వం కసరత్తు చేసింది. అందులో భాగంగా బీటెక్‌లో 10 నెలల ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కొత్త సిలబస్‌ను విడుదల చేసింది. రెండు, మూడు సంవత్సరాల వేసవి సెలవుల్లో రెండు నెలల చొప్పున, చివరి ఏడాదిలో ఆరు నెలలు ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌లో విద్యార్థి సమర్పించే నివేదికకు 40%, ప్రదర్శనకు 60% వెయిటేజీ ఇస్తారు. ఇది పూర్తి చేయకుంటే బీటెక్‌ పట్టాను ప్రదానం చేయరు. ఇక రెండో ఏడాది వేసవి సెలవుల్లో విద్యార్థులు 180 గంటల సామాజిక సేవనూ చేయాలి. ఎన్‌ఎస్‌ఎస్‌/ఎన్‌సీసీలో తప్పనిసరిగా మొదటి ఏడాదిలో కనీసం 45 గంటలు పాల్గొనాలి. వీటన్నింటితోపాటు 75% హాజరు తప్పనిసరి. 10% హాజరు వరకు మినహాయింపు ఇచ్చేందుకు కళాశాల అకడమిక్‌ కమిటీకి అధికారమిచ్చారు.

నైపుణ్య ఆధారిత కోర్సులు

* ఐదు నైపుణ్య కోర్సులు ఉంటాయి. విద్యార్థి చదివే డొమైన్‌కు సంబంధించిన రెండు కోర్సులను రెండో ఏడాదిలో పూర్తి చేయాలి. మిగతా మూడింటిలో సాఫ్ట్‌ నైపుణ్యాలపై ఒకటి, ఉద్యోగాధారిత నైపుణ్యాలపై రెండే కోర్సులు ఉంటాయి.

* బీటెక్‌తోపాటు అదనంగా కోర్సులు చదివే వారికి ఆనర్స్‌ ఇస్తారు. ఆనర్స్‌ చేయాలనుకునే విద్యార్థులకు రెండో సెమిస్టర్‌ పూర్తయ్యేసరికి సెమిస్టర్‌ గ్రేడ్‌ పాయింట్‌ సరాసరి (ఎస్‌జీపీఏ) 7.5 ఉండాలి. మూడో సెమిస్టర్‌ పూర్తయ్యే సరికి ఈ ఎస్‌జీపీఏను సాధించాలి. నాలుగో సెమిస్టర్‌ నుంచి ఆనర్స్‌ డిగ్రీ ప్రారంభమవుతుంది.

* విద్యార్థి తప్పనిసరిగా నాలుగు కోర్సులు పూర్తి చేయాలి. ఒక్కోదానికి నాలుగు క్రెడిట్లు ఉంటాయి. మూక్స్‌, ఎన్‌పీటీఈఎల్‌ ఆన్‌లైన్‌ రెండు కోర్సుల్లో నాలుగు క్రెడిట్లు సాధించాలి. మొత్తం 20 క్రెడిట్లు రావాలి.

* విద్యార్థులు తాము చదువుతున్న బ్రాంచి కాకుండా వేరే బ్రాంచిలోనూ ఆనర్స్‌ మైనర్‌ డిగ్రీ పూర్తి చేసుకునే అవకాశముంది. మెకానికల్‌ విద్యార్థి సివిల్‌ నుంచి కొన్ని సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. మెకానికల్‌లో మేజర్‌ డిగ్రీ, సివిల్‌లో మైనర్‌ డిగ్రీ వస్తుంది.

విరామ సంవత్సరం

పూర్తిస్థాయి ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా మారాలనుకునే విద్యార్థి మూడేళ్లలో ఎప్పుడైనా ఏడాది విరామం తీసుకోవచ్చు. దీన్ని రెండేళ్లకు పొడిగించవచ్చు. విద్యార్థి సమర్పించే నివేదిక ఆధారంగా విశ్లేషణ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంటుంది.

ఇదీ చదవండి:నకిలీ గ్యాంగ్​కు డబ్బిచ్చి...నిజమైన వారికి చిక్కారు

ABOUT THE AUTHOR

...view details